ఎస్‌సీఓ వేదికగా మోదీ ఘాటు వ్యాఖ్యలు
ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపు
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని సూటిగా ప్రశ్నించారు. సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని, అది మొత్తం మానవాళికే పెను సవాల్ అని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోతోంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దాడి ఉగ్రవాదం క్రూరమైన ముఖాన్ని మరోసారి బయటపెట్టింది. ఇది కేవలం భారత్ పై జరిగిన దాడి కాదు, మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ దేశానికి విసిరిన బహిరంగ సవాల్ఁ అని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మిత్రదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదానికి బాహాటంగా మద్దతు పలికే కొన్ని దేశాల వైఖరిని మనం అంగీకరించాలా? ఉగ్రవాదం విషయంలో ఎలాంటి ద్వంద్వ వైఖరినీ సహించరాదని మనం ఐక్యంగా గళం విప్పాలి అని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం వంటివి శాంతికి, స్థిరత్వానికి అతిపెద్ద సవాళ్లని ఆయన అభివర్ణించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూడాలని, వాటిని పెంచి పోషించే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎస్‌సీఓలో భారత్ పాత్రను వివరిస్తూ.. భద్రత , అనుసంధానం , అవకాశాలు అనే మూడు కీలక స్తంభాల ఆధారంగా తమ విధానం ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎస్‌సీఓ వేదికగా భారత్ కీలక చొరవ తీసుకుందని ఆయన గుర్తుచేశారు.
