హైదరాబాద్, సెప్టెంబర్ 1: కదలిలే రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్ లపై ప్రమాదానికి కారణహేతువులైన వస్తువులను ఉంచడం వంటి చర్యలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులకు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు తీవ్రమైన గాయాలవుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన నేరస్థులు రైల్వే చట్టం, ఇతర క్రిమినల్ చట్టాల ప్రకారం విచారణకు బాధ్యత వహించవల్సి వస్తుందని హెచ్చరించింది. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
భవిష్యత్తులో ఇటువంటి సంఘ వ్యతిరేక సంఘటనలను నివారించడానికి, తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF ) జోన్ వ్యాప్తంగా వివిధ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో 2025లో జులై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు రైళ్లపై రాళ్ల దాడి చేసినందుకు 54 కేసులు నమోదయ్యాయని తెలిపింది. వాటిలో 30 కేసుల్లో ఇప్పటి వరకు 33 మంది నేరస్థులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అన్ని కేసులు సంబంధిత అధికార పరిధిలోని కోర్టులలో విచారణలో ఉన్నాయని తెలిపింది. అలాగే రైల్వే ట్రాక్‌లపై ప్రమాదానికి కారణహేతువులైన వస్తువులను ఉంచిన ఘటనల్లో 08 కేసులు నమోదుకాగా వాటిలో 06 కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. ఇందులో ఏడుగురు నేరస్థులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. అన్ని కేసులు సంబంధిత అధికార పరిధిలోని కోర్టులలో విచారణలో ఉన్నట్లు తెలిపింది
ప్రయాణీకుల భద్రత,రైల్వే ఆస్తుల రక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో రైల్వేలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు సంబందించిన సమాచారంను 139కి కాల్ చేసి తెలియజేయాలని, తద్వారా త్వరిత గతిన చర్యలు తీసుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ప్రయాణీకుల భద్రత, విలువైన జాతీయ వనరుల నష్టం, అలాగే వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రతికూల పరిణామాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కూడా ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.