Vizag is another Silicon Valley: అక్షరాల 81,000 కోట్లు.. వైజాగ్ మరో సిలికాన్ వ్యాలీ కావడం ఖాయం

Vizag is another Silicon Valley: మిగతా పరిశ్రమలు ఏమోగాని.. ఐటీ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రకరకాల కారణాలను అన్వేషిస్తుంటాయి. మెరుగైన భూమి.. సమర్థవంతమైన మానవ వనరులు.. స్థిరమైన ప్రభుత్వం.. కట్టుదిట్టమైన శాంతిభద్రతలు.. ఉత్తమమైన రవాణా వ్యవస్థ.. సానుకూల వాతావరణం.. అందువల్లే అమెరికాలో సిలికాన్ వ్యాలీ ప్రపంచ ఐటి రాజధానిగా ఉంది. బెంగళూరు భారత ఐటీ రాజధానిగా కొనసాగుతోంది. హైదరాబాదు విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది. తెలంగాణ లోని హైదరాబాద్ తో పోల్చి చూస్తే ఆంధ్రాలోని విశాఖపట్నం విచిత్రంగా ఉంటుంది. పక్కన సముద్రం ఉంటుంది కాబట్టి.. ప్రకృతి విపత్తులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఏర్పడిన హుద్ హుద్ తుఫాను విశాఖపట్నం ఏ స్థాయిలో అల్లకల్లోలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అటువంటి విశాఖపట్నం ఇప్పుడు తన రూపురేఖలను సమూలంగా మార్చుకుంటున్నది. పర్యాటకంగానే కాదు ఐటీ పరంగా సరికొత్త హంగులు అద్దుకుంటున్నది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రూపు రేఖలు మారిపోతున్నాయి. 50వేల కోట్లతో ప్రఖ్యాత గూగుల్ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికంటే ముందు అదాని కంపెనీ 14,634 కోట్లతో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఒక నెల క్రితం సిపి టెక్నాలజీస్ 16,466 కోట్లతో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది.. ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మొత్తంగా చూస్తే ఈ మూడు కంపెనీల ద్వారా వైజాగ్లో ఏకంగా 81 వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్టు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

విశాఖపట్నం దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా పేరు తెచ్చుకుంది. మహిళల జీవనం, భద్రత, రక్షణకు స్వర్గధామంగా ఈ ప్రాంతం నిలిచింది. మనదేశంలోని భువనేశ్వర్, కోహిమా, గ్యాంగ్ టాక్, ఈటనగర్, ఐజ్వాల్, ముంబై నగరాలతో కలిసి సంయుక్తంగా ఈ స్థానాన్ని విశాఖపట్నం దక్కించుకుంది. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నగరంలో మౌలిక సదుపాయాలు.. పోలీసింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. అయితే దక్షిణాది రాష్ట్రాలలో విశాఖపట్నం నగరానికి మాత్రమే ఈ ఘనత దక్కడం విశేషం. మరోవైపు దిగ్గజ సంస్థలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వైజాగ్ మరో సిలికాన్ వ్యాలీ అవుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. విస్తారమైన భూములు ఈ ప్రాంతంలో ఉండడంతో పెద్దపెద్ద కంపెనీలు తమ కార్యకలాపాలు సాగించడానికి ముందుకు వస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కూడా సానుకూలంగా ఉండడంతో కంపెనీ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Comment