Visakhapatnam: దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన విశాఖ( Visakhapatnam) చేరింది. చాలా రంగాల్లో విశేషమైన వృద్ధి సాధిస్తోంది. మొన్న ఆ మధ్యన క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడి పారిశుద్ధ్య చర్యలను కేంద్రం గుర్తించి అభినందించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా విశాఖ నగరం ఉంది. ఈ జాబితాలో ఇంకా భువనేశ్వర్, కోహిమా, ఈటా నగర్, ముంబై, గ్యాంగ్ టాక్ లు ఉన్నాయి. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై సర్వే చేసి నివేదికలో ఈ విషయాన్ని తేల్చింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయరహత్కర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని.. అది మహిళల జీవితంలోని విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు, స్వేచ్ఛ వంటి అంశాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. తద్వారా ఈ రంగాల్లో విశాఖ గణనీయమైన వృద్ధి సాధించినట్లు స్పష్టమవుతోంది.
Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?
* ప్రశాంత నగరం గా గుర్తింపు..
విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైనది. సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉండడంతో సాగర నగరంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తోంది. నగరం కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. అయితే మహిళలు స్వేచ్ఛగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. విద్యాపరంగా చాలామంది విశాఖకు వచ్చి చదువుకుంటున్నారు. దేశంలోనే గుర్తింపు పొందిన ఆంధ్ర యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు సైతం చేరుతుండడం గమనార్హం. సాధారణంగా పర్యాటక రంగంలో మహిళలకు ఎక్కువగా ఉపాధి ఉంటుంది. మహిళలకు సంబంధించిన నేరాలు కూడా జరుగుతుంటాయి. కానీ విశాఖలో అటువంటి పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర నుంచి కాకుండా ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రాంతాల నుంచి కూడా మహిళలు వచ్చి విశాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. సర్వేలో విశాఖ నగరం దేశంలోనే మహిళా భద్రతలో ప్రధమ స్థానంలో ఉందని గుర్తించింది జాతీయ మహిళా కమిషన్ కార్పొరేషన్.
* మహిళల రక్షణ కత్తి మీద సాము..
వాస్తవానికి విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. పోర్టు ఉంది. పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఎక్కువమంది మహిళలే పని చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు రక్షణ కల్పించడం కత్తి మీద సాము. కానీ విశాఖలో పోలీసు యంత్రాంగం పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మహిళల భద్రతపై జాతీయస్థాయిలో విశాఖ నగరం మొదటి స్థానంలో నిలవడంపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆనందం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు, పోలీస్ శాఖ కృషికి నిదర్శనమని ఆమె కొనియాడారు. విశాఖలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.