Trump tariff war: ట్రంప్‌ టారిఫ్‌ వార్.. అమెరికాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రపంచ దేశాలు!

Trump tariff war: డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తన వాణిజ్య విధానాల ద్వారా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే లక్ష్యంతో టారిఫ్‌ వార్‌కు తెరలేపారు. తమ దేశం ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై 25 శాతం నుంచి 50 శాతం వరకు పన్నులు విధించారు. కొన్ని దేశాలు భయం, భక్తి, వాణిజ్యం ఒప్పందం కోసం టారిఫ్‌లను అంగీకరించాయి. కానీ భారత్, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలు అమెరికా టారిఫ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. వీటివెంట ఇప్పుడు జపాన్, వియత్నాం కూడా కలిసి వస్తున్నాయి. దీంతో అమెరికా ఆధిపత్యంపై తిరుగుబాటు మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌పై 50 శాతం టారిఫ్‌..
ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. దీనికి కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపారు. భారత్‌ రష్యా నుంచి 35–40 శాతం చమురు దిగుమతి చేసుకుంటుంది, ఇది దేశ ఇంధన భద్రతకు కీలకం. అయితే, చైనా రష్యా నుంచి ఇంకా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ట్రంప్‌ చైనాపై సమాన స్థాయి సుంకాలు విధించడం లేదు. ఈ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో టెక్స్‌టైల్‌ రంగంలో దాదాపు రూ.3 వేల కోట్ల వాణిజ్య నష్టం, ఉద్యోగాల కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. ఈ నిర్ణయం భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను, గత 29 ఏళ్లుగా నిర్మించుకున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

ట్రంప్‌కు ఎదురుదెబ్బ..
ట్రంప్‌ టారిఫ్‌లకు వ్యతిరేకంగా చైనా, జపాన్, భారత్‌ వంటి దేశాలు ఐక్యంగా నిలిచాయి. ఈ దేశాలు షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సమావేశంలో చైనాలో సమావేశమై, అమెరికా ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా వ్యూహాత్మక సమన్వయాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. జపాన్‌తో జరిగిన వాణిజ్య చర్చల్లో ట్రంప్‌ తప్పుడు ప్రకటనలు చేయడంతో ఆ దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది, ఫలితంగా జపాన్‌ వాణిజ్య బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది. వియత్నాం, సౌత్‌ ఆఫ్రికా, బ్రెజిల్, వెనిజులా వంటి దేశాలు కూడా ట్రంప్‌ టారిఫ్‌లను ఖండిస్తూ, అమెరికా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ ఐక్యత ప్రపంచ వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే దిశగా ఒక ముందడుగుగా కనిపిస్తోంది.

బ్రిక్స్‌ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ..
బ్రిక్స్‌ దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్‌ ఆఫ్రికా, ఇతర సభ్య దేశాలు) అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత చెలామణి వ్యవస్థను రూపొందించే దిశగా పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థ స్విఫ్ట్‌ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడవచ్చు. దీంతో రష్యా, ఇరాన్‌ వంటి దేశాలు పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకోవచ్చు. బ్రిక్స్‌ సభ్య దేశాలు తమ ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌లు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రిక్స్‌ దేశాలు 46% ప్రపంచ జనాభాను, 35.6% ఆర్థిక వాటాను కలిగి ఉన్నాయి. గ్లోబల్‌ సౌత్‌కు ఒక బలమైన శక్తిగా ఉద్భవిస్తున్నాయి.

అమెరికాలోనూ టారిఫ్‌లపై వ్యతిరేకత..
ఇదిలాఉంటే.. ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికన్‌ దిగుమతిదారులపై, తద్వారా వినియోగదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. 2025లో ఈ సుంకాల వల్ల అమెరికన్‌ గృహాలపై సగటున 1,300 డాలర్ల అదనపు పన్ను భారం పడనుందని అంచనా. ఈ టారిఫ్‌లతో దిగుమతి ధరలు పెరిగి, అమెరికన్‌ వినియోగదారులకు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల రూపంలో ప్రభావం చూపుతుంది. ఆర్థిక విశ్లేషకులు, ఎకనామిస్టులు ట్రంప్‌ విధానాలను తప్పుబడుతున్నారు. అమెరికన్లు కూడా సుంకాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. దీనివల్ల ప్రజాభిప్రాయం ట్రంప్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.

గత మూడు దశాబ్దాలుగా భారత్‌–అమెరికా మధ్య నిర్మితమైన ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం ట్రంప్‌ టారిఫ్‌లతో దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్‌ తన ఇంధన భద్రత, వ్యవసాయ రంగ రక్షణ వంటి ముఖ్య అంశాలపై గట్టిగా ఉండటం వల్ల ట్రంప్‌ విధానాలకు లొంగకుండా ఉంది. అయితే, ఈ టారిఫ్‌లు భారత ఎగుమతులను దెబ్బతీసి, విదేశీ పెట్టుబడుల స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. భారత్‌ తన వాణిజ్య వ్యూహంలో చైనా, రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ, అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

Leave a Comment