RCB Bengaluru Stampede: 25 లక్షలు.. పోయిన ప్రాణాలను తీసుకొస్తాయా?

RCB Bengaluru Stampede: అడవిలో జింకలను తిన్న పులి.. ఉన్నట్టుండి శాంతంగా మారిపోయింది అంటే ఎవరైనా నమ్ముతారా.. జరిగిన దారుణానికి తానే కారణమని.. ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని చెబితే ఎవరైనా విశ్వసిస్తారా.. లేదు కదా.. ఇప్పుడు బెంగళూరు జట్టు యాజమాన్యం చేస్తున్న పని కూడా అలానే ఉంది. చేసిన దారుణం చేసేసి.. కళ్ళముందు ప్రాణాలు కోల్పోతున్నా వినోదం చూసి.. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సంతాపం తెలియజేస్తోంది.

సరిగ్గా మూడు నెలల క్రితం కర్ణాటక రాజధానిలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఇప్పటికీ కొంతమంది కోలుకోలేదు. అయిన వారిని కోల్పోయి వారి కుటుంబ సభ్యులు పెడుతున్న శోకం మామూలుగా లేదు. వాస్తవానికి మైదానం వెలుపల ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ లోపల బెంగళూరు యాజమాన్యం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. గేట్లు మూసి వేయడంతో.. అభిమానులు భారీగా రావడంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ దారుణానికి బెంగళూరు జట్టు యాజమాన్యమే ప్రధాన కారణం. అయినప్పటికీ తన తప్పును అంగీకరించే స్థితిలో బెంగళూరు యాజమాన్యం లేదు. ఇప్పటికి కూడా ఏదో తప్పనిసరి తద్దినం లాగా 25 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది కానీ.. జరిగిన దారుణానికి బెంగళూరు యాజమాన్యం లెంపలు వేసుకోవాల్సిందే.

వాస్తవానికి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత అప్పటికప్పుడు బెంగళూరు యాజమాన్యం ట్విట్టర్లో ప్రకటన చేసింది. తమ జట్టును అభిమానించే వారంతా కూడా విక్టరీ పరేడ్ కు రావాలని పిలుపునిచ్చింది. పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి తను అనుకున్న పని నెరవేర్చుకుంది. భారీగా అభిమానులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్లు సరిగా చేయలేకపోయింది. దీనికి తోడు చిన్నస్వామి స్టేడియంలో గేట్లు మూసివేయడం.. అభిమానులు భారీగా వచ్చిన తర్వాత ఒకేసారి తెరవడంతో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దారుణంలో 11 మంది చూస్తుండగానే కన్నుమూశారు. నూనూగు మీసాల వయసు నుంచి మొదలు పెడితే.. మధ్య వయసు ఉన్న వారి వరకు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ దారుణం తర్వాత బెంగళూరు యాజమాన్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత బెంగళూరు యాజమాన్యం చనిపోయిన వారిలో ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది..” బెంగళూరు కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మాలో ఒక భాగం. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే వారి స్థానాన్ని మేము భర్తీ చేయలేం. మొదటి అడుగుగా 25 లక్షలు ఇచ్చామని” బెంగళూరు యాజమాన్యం ప్రకటించింది. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చేయాల్సిన దారుణం మొత్తం చేసేసి ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Leave a Comment