Rahul Dravid: హెడ్‌ కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ రాజీనామా! ఆ టీమ్‌కు ఊహించని షాక్‌.. – Telugu News | Rahul Dravid Resigns as Rajasthan Royals Head Coach

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ ధృవీకరించింది. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కంటే ముందు రెండేళ్ల కాల పరిమితితో హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌ అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్రాంచైజీ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం.. సెప్టెంబర్ 6, 2024న రెండేళ్ల ఒప్పందంపై నియమించబడిన 52 ఏళ్ల లెజెండ్‌ ఇటీవలె జరిగిన చర్చలో వచ్చే సీజన్‌లో హెడ్‌ కోచ్‌గా కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

“రాయల్స్ జట్టు ప్రయాణంలో రాహుల్ చాలా సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఒక తరం ఆటగాళ్లను ప్రభావితం చేసింది, జట్టులో బలమైన విలువలను నిర్మించింది. ఫ్రాంచైజీ సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది” అని ఆర్‌ఆర్‌ ఫ్రాంచేజ్‌ పేర్కొంది. “ఫ్రాంచైజ్ నిర్మాణ సమీక్షలో భాగంగా రాహుల్‌కు ఫ్రాంచైజీలో విస్తృత స్థానం ఆఫర్ చేయబడింది, కానీ దానిని ద్రవిడ్‌ సున్నితంగా తిరస్కరించారు. రాజస్థాన్ రాయల్స్ దాని ఆటగాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు రాహుల్ ఫ్రాంచైజీకి చేసిన అద్భుతమైన సేవకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.” అని పేర్కొంది.

కాగా రాహుల్‌ ద్రవిడ్‌ గతంలో 2011, 2015 మధ్య ఆటగాడిగా, కోచ్‌గా రాయల్స్‌కు మూలస్తంభంగా ఉన్నాడు, గత ఏడాది టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ద్రవిడ్‌ ఆర్‌ఆర్‌ హెడ్‌ కోచ్‌గా వచ్చారు. అయితే ఐపీఎల్‌ 2025 రాయల్స్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment