Radha Kumari Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలు( government employeements ) అంటేనే గగనం అవుతున్న వేళ.. ఒకేసారి ఐదు కొలువులను సాధించింది ఓ సాధారణ గృహిణి. అటు కుటుంబ బాధ్యతలు.. ఇటు ఉద్యోగ శిక్షణ కోసం ఆలు పెరగని పోరాటం చేసింది ఆ మహిళ. ఉపాధ్యాయురాలు కావాలని ఆకాంక్షించింది. అందుకే బీఏడ్, డీఎడ్, లాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేశారు ఆమె. ఐదేళ్లపాటు సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు డీఎస్సీ కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. చివరకు అనుకున్నది సాధించింది. ఏకకాలంలో ఐదు ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి.. ఉపాధ్యాయురాలిగా ఎంపికయింది శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మతలబుపేట గ్రామానికి చెందిన చింతాడ రాధాకుమారి.
Also Read: సుమ కొడుకు…మంచి కంటెంట్ తోనే దిగాడుగగా…
* ఓ సాధారణ గృహిణి..
రాధాకుమారి( Radha Kumari) అందరిలానే ఓ సాధారణ గృహిణి. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయురాలు కావాలనుకోవడం ఆమె జీవిత లక్ష్యం. ఈ తరుణంలో గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ఆశగా ఎదురుచూసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చింది. అయితే తాను చదివిన డిగ్రీలన్నింటికీ సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది ఆమె. ఓపికగా పరీక్షలు కూడా రాసింది. తాజాగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాల్లో రాసిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంపికయింది. ఐదు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై రికార్డ్ సృష్టించారు ఆమె. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామస్తులు ఆమెను అభినందిస్తున్నారు.
* భర్త సామాన్య ఎల్ఐసి ఏజెంట్..
రాధా కుమారి భర్త కెఎల్ నాయుడు( KL Naidu ) హైదరాబాదులో ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నారు. వీరికి 2016లో కవలలు జన్మించారు. అయితే ఒకవైపు వైవాహిక జీవితం లో కొనసాగుతున్న చదువుకోవాలన్న తపనలో ఉండేవారు రాధాకుమారి. భార్యలో ఉన్న ఈ సుగుణాన్ని గమనించిన భర్త ప్రోత్సహించారు. దీంతో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు సబ్జెక్టులో పీజీ పూర్తి చేశారు. అటు తర్వాత విశాఖలో లాంగ్వేజ్ పండిట్ కోర్స్, ఉమ్మడి హైదరాబాదులో టిటిసి, ఆంధ్ర యూనివర్సిటీలో బిఎడ్ పూర్తి చేశారు. గత ఐదేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ వచ్చారు. మెగా డీఎస్సీలో భాగంగా ఎస్ జి టి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, టీజీటీ తెలుగు, టీజీసీ సోషల్ స్టడీస్ లో దరఖాస్తు చేసారు. అహోరాత్రులు శ్రమించి అన్ని పరీక్షలు రాశారు. ఈనెల మొదటి వారంలో విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో అనూహ్యంగా అన్ని సబ్జెక్టులను ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఎస్జీటీ విభాగంలో చిత్తూరు జిల్లాలో నాన్ లోకల్ కింద 14 వ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 23వ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 39వ ర్యాంక్, టీజీటీ సోషల్ లో 77వ ర్యాంక్, టీజీటీ తెలుగులో 13వ ర్యాంకు సాధించి అబ్బురపరిచారు.
* నేటి తరానికి ఆదర్శం..
నిజంగా రాధాకుమారి నేటి తరానికి ఒక మార్గదర్శకం. ప్రభుత్వ కొలువు దక్కించుకోవాలని ఆమె తపన మూడు టీచర్ ట్రైనింగ్ డిగ్రీలు( teacher training degrees) చేసేలా ప్రేరేపించింది. వివాహం జరిగి ఓవైపు సంసారాన్ని చక్కదిద్దుకుంటూనే మిగతా సమయాల్లో చదువుకు కేటాయించారు. కుటుంబ బాధ్యతలు ఆశయానికి అడ్డు కాదని ఆమె మరోసారి నిరూపించారు. అయితే ఆమె ప్రయత్నానికి భర్త కె.ఎల్ నాయుడు ప్రోత్సాహం తోడైంది. ఎవరు సాధించలేని అద్భుత ప్రతిభను ఆమె చేసి చూపించారు.