Pawan Kalyan Message: జనసేన అధినేత పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తన మూడు రోజుల విశాఖ పర్యటనలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేశారు. తన మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టేశారు. గత మూడు రోజులుగా జనసేన విస్తృతస్థాయి సమావేశాలు విశాఖలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ బలోపేతం పై కీలక సూచనలు చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ఏ పని చేయాలో.. ఏ పని చేయకూడదో చెప్పేశారు. ఈ అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఆ విమర్శలు రావడంతోనే?
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. 15 నెలల పాలన పూర్తయింది. పాలనలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. మరో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు ఉన్నారు. అయితే జనసేనకు సింహభాగం రాజకీయ ప్రయోజనాలు దక్కడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర ప్రయోజనాల విషయంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శ కూడా ఉంది. చాలాచోట్ల తెలుగుదేశం పార్టీతో సమన్వయం లేకపోవడం.. జనసేన నేతలు సొంత అజెండాతో ముందుకెళ్లడం.. ఇష్టరాజ్యంగా ప్రకటనలు చేయడం.. సోషల్ మీడియా వేదికగా అనవసరంగా స్పందించడం వంటి వాటిపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటిని నియంత్రించేందుకు విశాఖ సభలను పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు.
వ్యక్తిగత ఎజెండా వద్దు జనసేనలో( janasena ) ఉండే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి గుర్తింపు లభిస్తుందని.. అందుకు తన హామీ అంటూ చెప్పుకొచ్చారు పవన్. అదే విషయంలో పార్టీ గుర్తించి పదవులతో పాటు గౌరవం ఇస్తుందని.. కానీ వ్యక్తిగతంగా ఎదిగేందుకు ప్రయత్నించవద్దని ఒక హెచ్చరిక చేశారు పవన్. ప్రభుత్వం నుంచి వచ్చే పదవులు, ఇతరత్రా రాయితీలు తీసుకోండి కానీ.. వాటికోసం అడ్డగోలుగా వ్యవహరించవద్దని కూడా తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాల్సిందేనని చెప్పారు. బిజెపి అవసరం ఉందని తేల్చేశారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని.. చంద్రబాబు సీనియారిటీని గౌరవించాల్సిందేనని పార్టీ శ్రేణులకు అల్టిమేటం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సిందే..
ఒకవైపు కూటమిని( alliance) గౌరవిస్తూనే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలని కూడా పార్టీ శ్రేణులకు పవన్ సంకేతాలు పంపించారు. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాకూడదని.. అందుకు మీరంతా కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చర్యలతో ఈ రాష్ట్రం వినాశనం దిశగా పయనించిందని.. దానిని సరిచేసే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీదేనంటూ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు పవన్. ఒక్కమాటలో చెప్పాలంటే 2029 ఎన్నికల వరకు కూటమిని గౌరవిస్తూనే.. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలని క్లియర్ కట్ గా చెప్పేశారు.