Pawan Kalyan-Chandrababu Naidu: రాజకీయాలు, ( politics) రూటు మారాయి. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు దూకుడుగా ముందుకు సాగవచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సంక్షోభాలు ఎదురైతే తట్టుకోవడం కష్టం. అటువంటి సమయంలోనే ట్రబుల్ షూటర్లు, క్రైసిస్ మేనేజర్లు అవసరం. ప్రతిపక్షంలో ఉన్నవారికి ట్రబుల్ షూటర్ అవసరం. అధికారపక్షంలో ఉన్నవారికి క్రైసిస్ మేనేజర్లు కీలకం. అయితే అప్పుడెప్పుడో జాతీయ పార్టీలకు అండగా చాలామంది నేతలు ఉండేవారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని నడపాలంటే కూడా.. చుట్టూ వలయం లాంటి నేతలు అవసరం. ప్రభుత్వానికి కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడి.. అధిగమించే నాయకుడు కీలకం. ఇప్పుడు ఆ పాత్రను అలవోకగా నెగ్గుకొస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు సజావుగా పాలనను ముందుకు తీసుకెళుతున్నారంటే.. దానికి ముమ్మాటికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అప్పట్లో హరీష్ రావు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం ఉంది. ఆ సమయంలోనే చంద్రబాబు నుంచి తెలంగాణ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఒకవైపు, బిజెపి తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నం మరోవైపు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ సమయంలోనే క్రైసిస్ మేనేజర్లుగా నిలిచారు హరీష్ రావు. ఒక రక్షణ వలయంలో మారి కెసిఆర్ కు ఇబ్బంది లేకుండా చేశారు.
చంద్రబాబుకు బలమైన అండగా..
అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకు సైతం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఒక క్రైసిస్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. చంద్రబాబుకు కష్టం వచ్చిన ప్రతిసారి వాలిపోతున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ కు గురయ్యారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది. చివరకు చంద్రబాబు కుటుంబం కూడా ఇబ్బంది పడింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఓ పావు గంట సేపు మాట్లాడారు. జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీని ఒప్పించారు. సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గారు. కూటమి కట్టడంలో సక్సెస్ అయ్యారు. ఓట్ల బదలాయింపు జరగడంలో కీలకపాత్ర పోషించారు. మంత్రివర్గ కూర్పులో కూడా సహకరించారు. 15 నెలల పాలనలో చంద్రబాబుకు సహకరిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్.
ప్రతికూలతలు వచ్చిన ప్రతిసారి..
సహజంగా అధికార పార్టీపై విమర్శలు రావడం ఖాయం. ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రతికూలత రావడం సర్వసాధారణం. అయితే ఈ 15 నెలల కాలంలో ప్రభుత్వంపై ప్రతికూలత వచ్చిన ప్రతిసారి పవన్ ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతున్నారు. ఆయన వైఖరి మూలంగానే రాష్ట్రం నష్టపోయిందని చెబుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు వరం పవన్ కళ్యాణ్. పవన్ ఉండగా.. చంద్రబాబు కు రాజకీయంగా ఇబ్బంది పెట్టలేమని ప్రత్యర్ధులు ఒక అంచనాకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు పవన్. నిజంగా ఆయన చంద్రబాబుకు ఒక వరమే.