Mood Of The Nation Survey: భారత రాజకీయ చరిత్రలో ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరగడం సహజం. సాధారణంగా, ఒక ఏడాది లేదా రెండేళ్ల పాలన తర్వాత ప్రజలలో అసంతృప్తి, విమర్శలు, ఆరోపణలు వస్తాయి. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని జాతీయ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, మోదీ వ్యక్తిగత ఆదరణ మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా సీఓటర్, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా మోదీ 52 శాతం ఆదరణ పొందారు.
సాధారణంగా, ఏ ప్రభుత్వమైనా కొంత కాలం అధికారంలో ఉన్న తర్వాత వ్యతిరేకత ఎదుర్కొంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీపై స్వాతంత్య్ర సమర ఔన్నత్యం కారణంగా వ్యతిరేకత తక్కువగా ఉండేది, అప్పటి ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండేది. ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ, ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా ఎమర్జెన్సీ, ఆమె పదవిని కోల్పోయేలా చేశాయి. దీనికి విరుద్ధంగా, నరేంద్ర మోదీ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా వ్యతిరేకతను ఎదుర్కోలేదు. సీవోటర్, ఇండియా టుడే ’మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో మోదీ 52 శాతం మద్దతును సొంతం చేసుకోగా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేవలం 26 శాతం ఆదరణ మాత్రమే పొందారు. ఈ గణాంకాలు మోదీ అసాధారణ ఆదరణను స్పష్టం చేస్తాయి.
మోదీ ఆదరణకు కారణాలు..
మోదీ ఆదరణకు అనేక కారణాలు ఉన్నాయి. మొదట, ఆయన బలమైన నాయకత్వ ఇమేజ్‌ను నిర్మించుకున్నారు. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించాయి. రెండోది మోదీ Üమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహం. రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’, సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలతో నేరుగా సంబంధం నెలకొల్పారు. మూడోది బీజేపీ సంస్థాగత బలం, మోదీ వ్యక్తిగత చరిష్మా కలిసి ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలో సహాయపడ్డాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ మోదీ ఇమేజ్‌ను దెబ్బతీయడంలో విఫలమయ్యాయి. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. రాహుల్ గాంధీ ఆదరణ 6 శాతం నుండి 26 శాతం పెరగడమే. అయితే అది మోదీ స్థాయికి సమానం కాదు. ఇక అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి ఇతర బీజేపీ నాయకులు కూడా రాహుల్ కంటే ఎక్కువ ఆదరణ పొందడం గమనార్హం.
ప్రతిపక్షాల సవాళ్లు..
ప్రతిపక్షాలు మోదీ వ్యతిరేక ఉద్యమాలను నిర్మించడానికి ప్రయత్నించినప్పటికీ, వాటి ప్రభావం పరిమితంగా ఉంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, రైతు సమస్యలను లేవనెత్తినప్పటికీ, మోదీ వ్యక్తిగత ఇమేజ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సీవోటర్, ఇండియా టుడే సర్వేలు, వామపక్ష భావజాలం కలిగిన మీడియా సంస్థలు. అవి నిర్వహించిన సర్వేలో కూడా మోదీ ఆదరణను ధృవీకరించాయి. ఇది ప్రతిపక్షాల సమన్వయ లోపం, బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది.
నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే, మోదీ నాయకత్వం ప్రత్యేకమైనది. నెహ్రూ సమయంలో స్వాతంత్య్ర ఉద్యమ ఔన్నత్యం కాంగ్రెస్‌కు ఆదరణ తెచ్చిపెట్టింది, అయితే ప్రతిపక్షం బలహీనంగా ఉండేది. ఇందిరా గాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ, ఆమె నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మోదీ సమయంలో, బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయలేకపోయింది. ఇది ఆయన రాజకీయ వ్యూహం, ప్రజలతో సంబంధం నెలకొల్పే సామర్థ్యాన్ని సూచిస్తుంది.