MLC for Kodandaram: కోదండరాం కు ఎమ్మెల్సీ.. అజహారుద్దీన్ కు చెక్.. ఇదీ రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీ

MLC for Kodandaram: ఉస్మానియా యూనివర్సిటీ లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఆయన పలు విషయాలపై ప్రసంగించారు. ఇదే క్రమంలో కోదండరాం గురించి చర్చకు వచ్చింది. కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే గులాబీ పార్టీ నాయకులు తట్టుకోలేకపోయారని.. చివరికి కోర్టు దాకా వెళ్లి అనుకున్నంత పనిచేశారని.. వారేదో శునకానందం పొందినంత మాత్రాన కోదండరాం ను తాము తక్కువ చేయబోమని.. కచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ అన్నారు. 15 రోజుల్లోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారు. చెప్పినట్టుగానే రేవంత్ తన మాట నిలబెట్టుకున్నారు. శనివారం మంత్రివర్గ భేటీలో రేవంత్ కోదండరాం కు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ కోటాలో కోదండరాం కు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కోదండరాం తో పాటు మాజీ క్రికెటర్ అజాహరుద్దీన్ కు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు… మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అజాహరుద్దీన్ ఎంపిక ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. వాస్తవానికి కోదండరాం తో పాటు అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఆయన స్థానంలో అజాహరుద్దీన్ ను ఎంపిక చేస్తే ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉపఎన్నిక జరగనుంది. గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తామని గులాబీ పార్టీ ఇప్పటికే చెప్పింది. అయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ను బరిలోకి దింపుతారని తెలుస్తోంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఓడిపోయిన నేపథ్యంలో సానుభూతి అనేది కలిసి వస్తుందని.. కచ్చితంగా ఉప ఎన్నికల్లో తన గెలుస్తానని నవీన్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ని కలిసి తను మళ్లీ పోటీ చేస్తానని చెప్పడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అతనికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అలా చెక్ పెట్టారు..
ఇక ఇటీవల కాలంలో అజహారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఆయన వారిద్దరితో భేటీ అని నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆయనకే వస్తుందని వార్తలు వినిపించాయి. అయితే అజహరుద్దీన్ పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ ఒకసారిగా తన ప్రణాళిక మార్చారు. ఇందులో భాగంగానే అజహారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. తద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ చేశారు. నవీన్ యాదవ్ కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉందని.. అందువల్లే ఆయనకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నవీన్ యాదవ్ రేవంత్ మనిషిగా ముద్రపడ్డాడు. గత కొంతకాలంగా ఇక్కడ అతడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

Leave a Comment