Jagan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) విశాఖ పర్యటనలో ఉన్నారు. మంత్రి నారా లోకేష్ సైతం విశాఖ టూర్ లోనే ఉన్నారు. అటు టిడిపి, ఇటు జనసేన విశాఖలో సందడి చేస్తున్నాయి. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తుండగా.. నారా లోకేష్ టిడిపి శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ రెండు పార్టీల యాక్టివిటీస్ బాగుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. కనీసం ఆ పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకునే వారు లేరు. మొన్న ఆ మధ్యన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును నియమించారు జగన్. ఆయన కొద్దిరోజుల పాటు హడావిడి చేసి వెళ్లిపోయారు. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద కదలిక లేదు. ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రతో పాటు విశాఖను జగన్ వదిలేసినట్లు కనిపించారు. కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా విశాఖ ముఖం చూడలేదు. అటు రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల వరకు పర్యటనలు చేశారు కానీ.. ఉత్తరాంధ్ర జోలికి రాలేదు.
Also Read: ‘సింగర్ ఆఫ్ ది ప్యారడైజ్’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
* వైసిపి హయాంలో ప్రాధాన్యం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో విశాఖకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా పాలనా రాజధానిగా విశాఖ ఎంపిక చేశారు. అంతకు ముందు నుంచే తన మనుషులను విశాఖ నగరానికి పంపించారు. తన ప్రతినిధిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అటు తర్వాత తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని సైతం ఇక్కడే ఉంచారు. ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమమైన విశాఖ వచ్చేవారు జగన్మోహన్ రెడ్డి. తన ఆస్థాన స్వామీజీ స్వరూపానంద కార్యక్రమాలకు పిలవడమే తరువాయి వచ్చి వాలిపోయేవారు. అటువంటి విశాఖను ఇప్పుడు అధికారం పోయిన తర్వాత చూడడం మానేశారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రం ప్రతి నెల, రెండు నెలలకు ఒకసారి విశాఖకు వచ్చి ఉత్తరాంధ్రను పలకరించి వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం ఉత్తరాంధ్ర వైపు చూడడం లేదు. తనకి ఇష్టమని చెప్పుకునే విశాఖ ప్రస్తావనే లేదు.
* పట్టు బిగిస్తున్న ఆ రెండు పార్టీలు..
ఉత్తరాంధ్రలో( North Andhra ) తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకటి, రెండు సార్లు తప్పిస్తే.. మిగతా అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో అయితే కూటమి కట్టి ప్రభంజనం సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 2019 ఎన్నికల్లో మాత్రమే మంచి విజయం దక్కింది. 34 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంటుంది. అందుకే అన్ని పార్టీలు ఉత్తరాంధ్ర పై ఫోకస్ పెడతాయి. ఇక్కడ బీసీల సంఖ్య అధికం. ఆపై మత్స్యకారులు, గిరిజనుల సంఖ్య కూడా అధికమే. అయితే ఆ వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు టిడిపి, జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడింది. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను మరిచిపోయినట్టు కనిపిస్తున్నారు.