Chandrababu Big Sketch: కరువు లేని ఏపీ.. పోలవరం పూర్తి.. బాబు పెద్ద స్కెచ్

Chandrababu Big Sketch: అపార సాగునీటి వనరులు ఏపీ( Andhra Pradesh) సొంతం. శ్రీకాకుళంలో వంశధార నుంచి పెన్నా నది వరకు.. సాగునీటి వనరులు పుష్కలం. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ఏపీ వెనుకబడి ఉంది. దానినే గుర్తు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పై సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక సూచనలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు ప్రత్యేక లక్ష్యంతో పని చేస్తున్నారు. 2027 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. అనుకున్న లక్ష్యానికి తప్పకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని తేల్చి చెప్పారు.

మారిన అభిప్రాయం..
వ్యవసాయంతో పాటు సాగునీటి వనరుల విషయంలో చంద్రబాబు( CM Chandrababu) అభిప్రాయం మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నదుల అనుసంధానం పై దృష్టిపెట్టారు. గోదావరి నదిని పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేసి సక్సెస్ అయ్యారు చంద్రబాబు. అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నదుల అనుసంధానానికి అడుగులు వేశారు. ఈ ప్రయత్నం ప్రాథమిక దశకు దాటింది కూడా. చాలా నదుల అనుసంధాన ప్రక్రియ కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ నదుల అనుసంధాన ప్రక్రియను పక్కన పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం అయింది. అందులో భాగంగా ఈరోజు జలహారతి కార్యక్రమం జరిగింది.

బనకచర్లతో రాయలసీమ సస్యశ్యామలం..
రాష్ట్రవ్యాప్తంగా నదుల అనుసంధానం విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో రాయలసీమలో బనకచర్ల ప్రాజెక్టును( bankacharla project) పూర్తిచేసి.. పోలవరంతో అనుసంధానిస్తే రాయలసీమ సైతం సస్యశ్యామలం అవుతుందని భావిస్తున్నారు. కానీ దానికి తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు జలాల వివాదం తెరపైకి రావడంతో కేంద్రం సైతం అనుమతించేందుకు వెనక్కి తగ్గింది. అయినా సరే చంద్రబాబు తన ప్రయత్నం ఆపడం లేదు. తెలంగాణను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని.. అందుకే ఈ మంచి ప్రయత్నాన్ని రాజకీయ కోణంలో కాకుండా.. ప్రజల శ్రేయస్సు గా భావించి అందరూ సహకరించాలని చంద్రబాబు కోరుతున్నారు. తన జీవిత ఆశయంగా పేర్కొంటున్నారు. మొత్తానికైతే వ్యవసాయం, సాగునీటి విషయంలో ఒక సరికొత్త ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Leave a Comment