దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లింది. జమ్మూ కాశ్మీర్‌లో వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది. హిమాచల్‌లోని 10 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగిపడటం వల్ల 584 రోడ్లు మూసివేశారు. పంజాబ్‌లోని పాఠశాలలకు ఆగస్టు 30 వరకు సెలవు ప్రకటించారు. యూపీలోని 17 జిల్లాల్లోని 688 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. గత 48 గంటల్లో మృతుల సంఖ్య 41కి పెరిగింది. వీరిలో 34 మంది వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి చిక్కుకుని మరణించినవారు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. రైలు రాకపోకలపైనా ప్రభావం పడింది. ఉత్తర రైల్వే.. 58 రైళ్లను రద్దు చేసింది. 64 రైళ్లను మధ్యలోనే నిలిపివేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేశారు. అనేక జిల్లాల్లో నదులు ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాల కారణంగా జలమయం అయ్యాయి. తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరుతో సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆగస్టు 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలో సాధారణం కంటే 60% ఎక్కువ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. బుధవారం రాత్రి 8 గంటల నాటికి యమునా నది నీటి మట్టం 205.35 మీటర్లకు చేరుకుంది. ఇది ప్రమాద స్థాయినిదాటి ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. మణిమహేష్ యాత్ర వాయిదా పడింది. చంబాలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు, 3,269 మంది యాత్రికులను NDRF రక్షించింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మొత్తం 584 రహదారులను మూసివేశారు. బియాస్ నదిలో వరద.. మనాలిలో భారీ విధ్వంసం సృష్టించింది. మొబైల్ కనెక్టివిటీకి అంతరాయం కలిగింది. పంజాబ్‌లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. NDRF, సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. పఠాన్‌కోట్‌లోని మాధోపూర్ బ్యారేజీ వద్ద ఉన్న 60 మంది అధికారులను వైమానికదళం.. విమానంలో తరలించింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో చిక్కుకున్న 381 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులను కూడా సురక్షితంగా తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 27 నుంచి 30 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రాబోయే 24 గంటలు పంజాబ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా-యమునా నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. 17 జిల్లాల్లోని 688 గ్రామాలు దీని ప్రభావానికి లోనయ్యాయి. ఇప్పటివరకు, 2.45 లక్షలకు పైగా ప్రజలు, 30,000 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు మరణించారు. 2,000 మందికి పైగా బాధితులను ఖాళీ చేయించారు. వందలాది ఇళ్ళు దెబ్బతిన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగమైన అమృతసర్‌ను ఆదుకున్న వాహనం
Update Aadhaar: ఆధార్ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక సూచనలు
Megastar Chiranjeevi: అభిమానికి మెగాస్టార్ భరోసా!
ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి
Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు