హైదరాబాద్‌లో మళ్లీ మూసీ కలకలం.. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల బంద్

హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. దీంతో మూసీ ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా అత్యంత కీలకమైన మూసారాంబాగ్ బ్రిడ్జిని శుక్రవారం ఉదయం అధికారులు మూసివేశారు.

బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాదచారులతో పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వాహనాలను గోల్నాక బ్రిడ్జి మీదుగా మళ్లించడంతో ఆ మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. మూసీ నదిలో నీటిమట్టం పెరుగుతున్నందున, దాని పరీవాహక ప్రాంతాలైన కిషన్‌బాగ్‌, జియాగూడ, మలక్‌పేట, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్‌, గోల్నాక, అంబర్‌పేట వంటి అనేక లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆకస్మిక వరదలు వచ్చి నీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్‌లోని ముసానగర్, కమల్‌నగర్ నదీ తీర మురికివాడల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉస్మాన్‌సాగర్ జలాశయం నాలుగు గేట్ల ద్వారా 1,304 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. హిమాయత్‌సాగర్ మూడు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతోంది. మరోవైపు, చాదర్‌ఘాట్ కాజ్‌వే కింద నుంచి నీరు ప్రవహిస్తున్నప్పటికీ, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. వర్ష సూచన ఉన్నందున జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఏటా వరదలతో మునిగిపోయే మూసారాంబాగ్ బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారంగా, ప్రభుత్వం సుమారు రూ. 50 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా ఆరు లేన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిందే.

Leave a Comment