శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు

: ప్రధాని చైనా పర్యటన వేళ రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం లేదా శాశ్వత శత్రుత్వం ఉండవని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ స్తిరంగా ఉండవని, కేవలం రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలు ఆధారంగా సంబంధాలు ఏర్పడుతాయని ఆయన అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడం కూడా అత్యంత అవసరమని ఆయన ఓ జాతీయ మీడియా సదస్సులో పేర్కొన్నారు.

భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు: రాజ్‌నాథ్‌
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ తరువాతి పరిణామాలు, ట్రంప్ సుంకాలు, అలాగే ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని వెల్లడించారు. ప్రపంచం వేగంగా మారుతున్నందున కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. మహమ్మారులు, ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి అంశాలతో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఆత్మనిర్భరత అత్యవసరం. మనకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు, కేవలం దేశానుకూలమైన శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు,ఁ అని ఆయన అన్నారు.

రక్షణ రంగం ఎగుమతుల విలువ 24,000 కోట్లు
మన రైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలు భారతదేశానికి ప్రధానమని, భౌగోళిక రాజకీయాల మార్పుల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైనది కాదని వివరించారు.
స్వావలంబన భారత ఆర్థిక వ్యవస్థ,భద్రతకు మౌలిక అవసరమని ఆయన పేర్కొన్నారు.
2014లో రక్షణ రంగం ఎగుమతులు 700 కోట్ల రూపాయలకు చేరగా, ప్రస్తుతం అది 24,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ గణాంకాలు భారత్ ఇక కొనుగోలుదారుగానే కాకుండా, ఎగుమతిదారుగా మారిందని సూచిస్తున్నాయి.

మోదీ చైనా పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం
భారత సైన్యాలు స్వదేశీ పరికరాలతో లక్ష్యాలపై ఖచ్చితంగా దాడులు చేయగలవని, దూరదృష్టి, సమన్వయం,సన్నద్ధత లేకుండా ఏ మిషన్ విజయవంతం కానుందని వివరించారు.
అయితే, భారత్ మిత్రదేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తించినప్పటికీ, భారత్‌పై సుంకాలు విధించడాన్ని కొనసాగించారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసే భారత్‌పై గతంలో 25% సుంకాన్ని విధించగా, ఇప్పుడు అదనంగా మరో 25% సుంకాలు విధించబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏడేళ్ల తరువాత ప్రధాని మోదీ చైనాకు చేసిన పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.

Leave a Comment