కన్పూర్‌కు చెందిన ఓమ్‌జీ శుక్లా అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి నెలకు రూ.10వేల జీతం వస్తుంది. దానితోనే అతను తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత రెండు వారం క్రితం శుక్లాకు ఢిల్లీ సీజీఎస్టీ కార్యాలయం నుంచి ఒక నోటీసు వచ్చింది. అయితే నోటీసు తెరిచి చూసిన శుక్లా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆ నోటీసులో సీజీఎస్టీ ఏకంగా రూ.3.14 కోట్ల పన్ను చెల్లించాలని పేర్కొంది. అయితే ఆగస్ట్ 21న జీఎస్టీ ఆఫీస్ నుంచి శుక్లాకు మరోసారి నోటీసులు అందాయి. ఈసారి ఏకంగా 32 పేజీలు నోటీసు వచ్చింది. ఈ నోటీసుల్లో ఆయన పేరు, చిరునామా, పాన్ నంబర్‌తో సహా శుక్లాను ఒక బట్టల వ్యాపారిగా జీఎస్టీ పేర్కొంది. దానితో పాటు ఏడు రోజుల్లో అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
అయితే ఈ నోటీసులపై శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. నెలకు కేవలం ₹ 10,000 సంపాదిస్తున్న తనకు జీఎస్టీ ఆఫీస్ నుంచి రూ.3.14 కోట్ల పన్ను నోటీసు వచ్చిందని తెలిపాడు. ఎవరో తనకు తెలియకుండా తన పాన్ కార్డును దుర్వినియోగం చేసి వ్యాపారాలను స్థాపించారని ఆరోపించారు. దానితో రూ.17 కోట్ల వ్యాపారం చేసి పన్ను ఎగ్గొట్టినట్టు తెలిపారు. అయితే శుక్లా మొదటగా ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా వారు జీఎస్టీ ఆఫీస్‌కు వెళ్లాలని సూచించారు.
దీంతో శుక్లా జీఎస్టీ అధికారులను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తనపై వచ్చిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆయన శుక్లాను కోరారు. దీంతో శుక్లా అధికారులకు ఒక లెటర్ రాసి ఇచ్చాడు.ఈ మోసం వెనుక ఉన్న నిందితుడిని గుర్తించడానికి స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.