జ్వరేవ్, గాఫ్ ముందుకు

జ్వరేవ్, గాఫ్ ముందుకు

మూడో రౌండ్‌లో అనిసిమోవా, పాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన మూడో సీడ్ కొకొ గాప్, 8వ అమందా అనిసిమోవాలు మూడో రౌండ్‌లో ప్రవేశించారు. ఆస్ట్రేలియా క్రీడాకారిణి డారియా కసట్కినా, జాక్వెలిన్ క్రిస్టియన్ (రుమేనియా)లు కూడా రెండో రౌండ్‌లో జయకేతనం ఎగుర వేశారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి కొకొ గాఫ్ రెండో రౌండ్‌లో క్రొయేషియాకు చెందిన డొనా వెకిక్‌ను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో గాఫ్ 76, 62తో వెకిక్‌ను ఓడించింది. తొలి సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది.

ఇటు గాఫ్ అటు వెకిక్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. అయితే ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన గాఫ్ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం గాఫ్‌కు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. గాఫ్ ఈ సెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వెకిక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది. అనిసిమోవా కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి జయింట్‌తో జరిగిన రెండో రౌండ్‌లో అనిసిమోవా 76, 62తో విజయం సాధించింది. తొలి సెట్‌లో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు.

దీంతో సెట్‌లో ఉత్కంఠత తప్పలేదు. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో అనిసిమోవా పైచేయి సాధించింది. నిలకడైన ఆటను కనబరిచిన అనిసిమోవా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం అనిసిమోవా చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో చెలరేగిన అనిసిమోవా సునాయాసంగా సెట్‌ను గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. అయితే కసట్కినా రెండో రౌండ్‌లో చెమటోడ్చి విజయాన్ని అందుకుంది. రష్యాకు చెందిన కమిల్లా రఖిమోవాతో జరిగిన పోరులో కసట్కినా 62, 46, 75తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన కసట్కినాకు తర్వాతి సెట్‌లో చుక్కెదురైంది. ఈ సెట్‌ను కమిల్లా దక్కించుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మళ్లీ కసట్కినా నిలకడగా ఆడింది. టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకుని ముందంజ వేసింది.

అలవోకగా..

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జ్వరేవ్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన జాకబ్‌తో జరిగిన రెండో రౌండ్‌లో జ్వరేవ్ 64, 64, 64తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే జ్వరేవ్ నిలకడగా ఆడాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో 8వ సీడ్ మినార్ సునాయసంగా విజయం సాధించాడు.

జపాన్ ఆటగాడు షిన్‌టారోతో జరిగిన పోరులో మినార్ 62, 64, 62తో జయకేతనం ఎగుర వేశాడు. 14వ సీడ్ టామీ పాల్ చెమటోడ్చి విజయం సాధించాడు. పోర్చుగల్ ఆటగాడు నునో బొర్జేస్‌తో జరిగిన ఐదు సెట్ల సమరంలో పాల్ జయభేరి మోగించాడు. కాగా, గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. జర్మనీ ఆటగాడు డానియల్ అల్ట్‌మెయిర్ చేతిలో సిట్సిపాస్ పరాజయం చవిచూశాడు.

Also Read: ట్రంప్ వినాయక చవితి కానుక

Leave a Comment