Relief for senior IAS Srilakshmi: సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి రిలీఫ్!

Relief for senior IAS Srilakshmi: ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి( Senior IAS officer Srilakshmi) సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీ లక్ష్మీ నిందితురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె పేరును తొలగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ తరుణంలో అత్యున్నత న్యాయస్థానం.. మరోసారి వాదనలు విని నిర్ణయం వెల్లడించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాదనల అనంతరం ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించడం కుదరదని తేల్చి చెప్పింది. ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను సైతం కొట్టివేసింది.

ప్రస్తుతం అప్రాధాన్య పోస్టులో..
ఓబులాపురం మైనింగ్ కేసు( Obulapuram mining case ) ఇప్పటిది కాదు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ పై ఉన్న అభియోగం. ఈమే జగన్ అవినీతి కేసులో సైతం అరెస్టు అయ్యారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన శ్రీలక్ష్మిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రప్పించారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు శ్రీలక్ష్మి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమె అప్రాధాన్య పోస్టులోకి వెళ్లిపోయారు. రిజర్వులో కూడా పెట్టారు. ఇటీవల టీడీ ఆర్ బాండ్ల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇష్టపడితే తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై ఆరోపణలు చేశారు. తాజాగా శ్రీలక్ష్మికి సంబంధించి ఓబులాపురం కేసులో ఉపశమనం దక్కడం విశేషం.

ఎట్టకేలకు స్టే
ఓబులాపురం కేసుకు సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి సి.బి.ఐ కోర్టును( CBI Court) ఆశ్రయించారు. 2022 అక్టోబర్లో ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టి వేసింది. ఆమె వెంటనే ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని ఓబులాపురం కేసు నుంచి తప్పిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే సిబిఐ తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిపిఐ వాదనలు వినకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇరుపక్షాల వాదనలను మరోసారి వినాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. అయితే సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీ లక్ష్మీ పేరును తొలగించడం కుదరదని తేల్చింది. దీనిపై మళ్లీ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరీష్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం స్టే విధించింది. ప్రతి వాదులకు నోటీసులు పంపింది. దీంతో శ్రీలక్ష్మికి రిలీఫ్ దక్కినట్లు అయింది.

Leave a Comment