Rajasthan: డ్రైవ్ చేస్తూ గుండెపోటు.. సహాయకుడికి అప్పగించిన కొన్ని క్షణాల్లోనే డ్రైవర్..

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జరిగిన హృదయ విదారక సంఘటనలో, ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇండోర్ నుండి జోధ్‌పూర్‌కు వెళ్తున్న బస్సును నడుపుతున్నప్పుడు డ్రైవర్‌ సతీష్ రావుకు ఛాతిలో నొప్పిగా అనిపించింది. వెంటనే పక్కనే ఉన్న సహాయకుడితో బస్సు నడపమని చెెప్పాడు. సతీష్ విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలోనే పరిస్థితి క్షీణించింది. అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. 

ఆకస్మిక మరణం వెనుక నిశ్శబ్ద గుండెపోటు

వైద్య నిపుణులు రావుకు నిశ్శబ్ద గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. ఇది ఒక రకమైన గుండెపోటు. ఇది తరచుగా చాలా తక్కువ సంకేతాలు లేదా ఎటువంటి సంకేతాలు లేకుండా వస్తుంది. స్టీరింగ్ వీల్‌ను సహాయకుడికి అప్పగించాలని అతడు తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. లేదంటే రద్దీగా ఉండే మార్గంలో డ్రైవర్ పట్టుతప్పితే పెద్ద ప్రమాదం చోటు చేసుకునేది. 

నివేదికల ప్రకారం, సహ డ్రైవర్ మొదట్లో సహాయం కోసం సమీపంలోని మెడికల్ స్టోర్ వద్ద ఆపడానికి ప్రయత్నించాడు, కానీ అది మూసివేసి ఉంది. సకాలంలో చికిత్స అందుతుందనే ఆశతో బస్సును ఆసుపత్రి వైపు తీసుకువెళ్లాడు. కానీ వైద్య సహాయం అందకముందే రావు మరణించాడు. రావు ఆకస్మిక మరణం అతని కుటుంబంలో విషాదం నింపింది. అందుకే ఈ విషయంపై పోస్ట్‌మార్టం లేదా తదుపరి విచారణకు నిరాకరించింది.

Leave a Comment