భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, చైనాల దేశాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు టోక్యోకి చేరుకున్నారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మోడీ జపాన్ లో పర్యటిస్తున్నారు. జపాన్‌తో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం కావచ్చు. ఆగష్టు 30 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన జపాన్ కౌంటర్ షిగెరు ఇషిబాతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
జపాన్ పర్యటన సందర్భంగా.. ప్రధాన మంత్రి మోడీ X లో పోస్ట్ చేస్తూ.. జపాన్ ప్రధాన మంత్రి ఇషిబా, ఇతరులను కలవడానికి తాను ఎదురుచూస్తున్నానని.. ఈ పర్యటన ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడానికి, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. జపాన్ తర్వాత.. ప్రధాన మంత్రి మోడీ చైనాను సందర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి
మోడీ పోస్ట్
Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B
— Narendra Modi (@narendramodi) August 29, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. భారత దేశంపై విధించిన వాణిజ్య, సుంకాల విధానాలు అమల్లోకి వచ్చాయి. దీంతో భారత్ అమెరికా సంబంధాలు క్షీణించిన సమయంలో.. ప్రధాని మోడీ జపాన్, చైనా పర్యటన చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం రాత్రి పర్యటనకు బయలుదేరే ముందు.. ఈ పర్యటన జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యతలను ముందుకు తీసుకువెళుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.
టోక్యోలో జరిగిన 15వ ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్‌కి ప్రధాని మోడీతో పాటు ప్రధాన మంత్రి ఇషిబా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రధాని మోడీ ప్రసంగిస్తూ .. మన దేశాల మధ్య బలమైన వ్యాపార సంబంధాలు మన స్నేహానికి కీలకమైన అంశమని చెప్పారు.
జపాన్‌కు చెందిన మీడియా ప్లాట్‌ఫామ్ నిక్కీ ఆసియా రానున్న దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యన్ పెట్టుబడి పెడుతుందని తెలిపింది. ఆటోమొబైల్స్, బ్యాటరీలు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్, అణుశక్తి , వైద్యంతో సహా బహుళ రంగాకు ఇది ఊతం కానున్నది.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్‌లను నిర్మించే తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను కూడా సందర్శిస్తారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యం పై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్- జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని నరేంద్ర మోడీ యోచిస్తున్నారు.
Addressing the India-Japan Economic Forum in Tokyo. Strong business ties between our nations are a vital element of our friendship. https://t.co/OUSvy98eJo
— Narendra Modi (@narendramodi) August 29, 2025
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా.. జపాన్ భారతదేశంలో బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రాజెక్టుల లక్ష్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జపాన్ మీడియా నివేదికల ప్రకారం.. జపాన్ వచ్చే దశాబ్దంలో భారతదేశంలో తన ప్రైవేట్ రంగ పెట్టుబడులను 10 ట్రిలియన్ యెన్లకు (68 బిలియన్ డాలర్లు) రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి ఇషిబా ఈ కొత్త లక్ష్యాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. రెండు ఆసియా దేశాలు 17 సంవత్సరాలలో మొదటిసారిగా భద్రతా సహకారంపై తమ ఉమ్మడి ప్రకటనను సవరించాలని యోచిస్తున్నాయని జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా నివేదించింది. ఆర్థిక భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి రెండు ప్రభుత్వాలు ఒక కొత్త ద్వైపాక్షిక సహకార చట్రాన్ని కూడా ప్రారంభించనున్నాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టోక్యోలో అక్కడి ప్రజలు గాయత్రి మంత్రం, భజనలతో స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ కళాకారులతో కలిసి ప్రధాని మోదీ గాయత్రి మంత్రం జపిస్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు. జపాన్ పర్యటన ముగించుకున్న తర్వాత, టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ చైనాకు బయలుదేరుతారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజులు ఆయన చైనాలో ఉంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..