Pawan Kalyan visits Rushikonda: రుషికొండ( rushikonda ) భవనాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భవనాలను తాజాగా పరిశీలించడం కొత్త చర్చకు దారితీసింది. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పవన్ భవనాలను పరిశీలించారు. విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హాజరైన పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాలను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ భవనాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. అధికారం చేపట్టిన తరువాత.. డిప్యూటీ సీఎం హోదాలో ఆ భవనాలను పరిశీలించారు. ఇప్పుడు రెండోసారి పరిశీలించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రుషికొండను మాయం చేసి.. భవనాలను నిర్మించడం ద్వారా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని.. ఇప్పుడు నిర్వహణకు కూడా అదనపు భారం పడుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
పర్యాటక రంగంపై వేటు..
విశాఖ నగరంలో( Visakha City) రిషికొండ అనేది ఒక ల్యాండ్ మార్క్. పర్యాటక ప్రాంతం కూడా. అదొక పర్వత ప్రాంతం. ఒకవైపు ప్రకృతి అందాలు, ఇంకో వైపు సువిశాల సముద్ర తీర ప్రాంతం దీని సొంతం. వైసిపి హయాంలో పర్యాటక అభివృద్ధి పేరుతో.. అక్కడి పాత రిసార్ట్లను కూల్చివేశారు. దాదాపు 500 కోట్లతో భారీ భవంతులు నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ భవనాలు ప్రభుత్వ ఆస్తిగా కాకుండా.. భారంగా మారాయి. ప్రస్తుతం ఆ ప్యాలెస్ నిర్వహణ ఖర్చు భారీగా ఉంది. కేవలం విద్యుత్ బిల్లులే ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలను పరిశీలించారు. భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన నిర్మాణాలను బయటపెట్టారు. అటు తరువాత ఈ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఎలా వినియోగించుకోవాలన్నది క్లారిటీ లేకుండా పోయింది. కొద్ది రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ఆ భవనాల పరిస్థితిని సమీక్షించారు. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకుందాం అనే దానిపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థలకు లీజుకు ఇచ్చే ఆలోచన చేశారు. మరోవైపు సినీ రంగానికి సంబంధించి వినియోగించుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే దీనిపై ఎటువంటి కదలిక లేదు.
పవన్ సూచనలు ఇవే..
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)ఆ భవనాలను పరిశీలించడం.. కీలక సూచనలు చేయడంతో.. సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ భవనాలను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలకు పెచ్చులూడి పడుతుండడం పై ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి రుషికొండ పర్యాటక ప్రాంతం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. కానీ అది అందకుండా పోగా.. వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్. అందుకే ప్రభుత్వానికి విలువైన సూచన చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు తమ పార్టీ తరపున సూచన అడిగారని గుర్తు చేశారు. పర్యాటక రంగంగా వినియోగించుకోవడంతో పాటు ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం వినియోగించాలని తమ పార్టీ తరఫున సూచనలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే తమ భవనాల వినియోగంపై.. సీఎంకు ప్రతిపాదనలు ఇస్తామని కూడా పవన్ వెల్లడించారు.