KTR And Bandi Sanjay In One Frame: కొన్నింటి గురించి మనం కచ్చితంగా చెప్పుకోవాలి. కొన్నిటి గురించి కచ్చితంగా వివరించాలి. అప్పుడే అందులో ఉన్న అసలు విషయం వెలుగు చూస్తుంది. ఇప్పుడంటే ఏదో టచ్ మీ నాట్ అన్నట్టుగా సాగిపోతోంది గాని.. ఒకప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉండేది. బండి సంజయ్ ని ఒక పార్లమెంటు సభ్యుడు అని కూడా చూడకుండా నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అరెస్టు చేసింది. రకరకాల ఊర్లు తిప్పి చివరికి హన్మకొండ మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచింది. అప్పట్లో అదొక సంచలనం. “కవితను అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా” అనే మాటకే ఏకంగా బండి సంజయ్ ని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. టెన్త్ పేపర్ లీక్.. ఇంకా ఏవేవో ఆరోపణలు చేసింది గాని.. అవన్నీ నిలబడలేదు. తడిబట్ట ప్రమాణాలు.. యాదగిరిగుట్ట దగ్గర సాష్టాంగ నమస్కారాలు.. ఇంకా ఇంకా చాలా జరిగిపోయాయి అప్పట్లో. బండి సంజయ్ కనుక భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగి ఉంటే అప్పట్లో లెక్క వేరే విధంగా ఉండేది. కాకపోతే ఆదిష్టానం తీసుకున్న నిర్ణయం భారతీయ జనతా పార్టీకి 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీరని నష్టాన్ని మిగిల్చింది.
పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలో కేటీఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా బండి సంజయ్ ని తిట్టాడు. ఇక గులాబీ పార్టీ సోషల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే బండి సంజయ్ వ్యక్తిత్వహననాన్ని ఏ స్థాయి దాకా తీసుకెళ్లాలో ఆ స్థాయి దాకా తీసుకెళ్ళింది. అఫ్కోర్స్ ఇందులో భారతీయ జనతా పార్టీ తక్కువేం కాదు. కాకపోతే గులాబీ పార్టీ లెవెల్ లో మాత్రం చేయలేకపోయింది. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేయలేదని, బండి సంజయ్ కి చదువు రాదని.. ఇలా రకరకాల ఆరోపణలు చేశాడు కేటీఆర్. దానికి బండి సంజయ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల సమయం దొరికిన ప్రతిసారి కేటీఆర్ మీద ఏదో ఒక రూపంలో బండి సంజయ్ విమర్శ చేస్తూనే ఉన్నాడు.. అయితే ఇప్పుడు వీరిద్దరూ పరస్పరం తారసపడ్డారు.
వర్షాల బీభత్సం వల్ల కామారెడ్డి అతలాకుతులమైంది. చాలామంది వరదల్లో చిక్కుకుపోయారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి హోదాలో బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. అప్పటికప్పుడు హోం శాఖకు చెందిన హెలికాప్టర్లను తీసుకొచ్చారు.. వరదల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడగలిగారు. వారందరికీ పునరావాసం కల్పించగలిగారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వీరిద్దరూ పరస్పరం ఎదురుపడితే బండి సంజయ్ అన్న బాగున్నావా అంటూ కేటీఆర్.. బాగానే ఉన్నా కేటీఆర్ అన్న అంటూ బండి సంజయ్ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు.. వాస్తవానికి తెలంగాణ రాజకీయాలకు కావాల్సింది ఇదే. నాయకుడి ప్రాపకం కోసం.. నాయకుడి మెప్పు కోసం కార్యకర్తలు ఇటీవల కాలంలో ఎన్ని మెట్లు దిగుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఏ స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నారు వివరించాల్సిన పనిలేదు. కాకపోతే అలాంటి వారంతా కేటీఆర్, బండి సంజయ్ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్న ఫోటోలు చూస్తే బీపీలు తగ్గుతాయి.. అన్నిటికంటే వ్యక్తిగత కోపాలు నేల చూపులు చూస్తాయి.. ఎందుకంటే తెలంగాణ వర్గానికి కొమ్ము కాయదు. వర్ణానికి వత్తాసు పలకదు..