Jayashankar Bhupalpally: అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యం.. పక్కనే నిమ్మకాయలు, పూజా సామాగ్రి – Telugu News | Jayashankar Bhupalpally Young Women Suspicious Death occult practices near dead body

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.. ఆమె మృతదేహం పక్కన క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కలవర పెడుతున్నాయి.. ఆమె ఆత్మహత్య చేసుకుందా..! లేక ఎవరైనా పూజలు చేసి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నారా..! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..

ఈ మృత దేహాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం- భూపాలపల్లి జాతీయ రహదారి పక్కనే మేడిపల్లి అటవీ ప్రాంత సమీపంలో గుర్తించారు. ఆ ప్రాంతంలో వెళుతున్న పశువుల కాపర్లు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మృతదేహం పక్కన ఆధార్ కార్డు, నిమ్మకాయలు, కొంత పూజ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు…

మృతురాలు చిట్యాల మండలం ఒడితెలా గ్రామానికి చెందిన కప్పల వర్షిని 22 అనే యువతిగా గుర్తించారు.. ఇంట్లో నుంచి 6వ తేదీన బయటికి వెళ్లిన యువతి కనిపించకపోవడంతో, తల్లి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న క్రమంలోనే డెడ్ బాడీ లభ్యమయింది

మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండడంతో క్షుద్రపూజలు చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..యువతి అనుమానాస్పద మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అటవీ ప్రాంతంలోకి ఎందుకు వచ్చింది..! ఎలా వచ్చింది..! ఎవరైనా తీసుకువచ్చారా..! పూజలు జరిపి హతమార్చారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

Leave a Comment