Jagan And KCR: కెసిఆర్ సలహాతో జగన్.. ఇక యుద్ధమే!

Jagan And KCR: ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య.. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ పోటీ విపరీతంగా ఉంది. కానీ దశాబ్ద కాలం పాటు రాజకీయం చేశాయి కెసిఆర్( KCR) నేతృత్వంలోని బిఆర్ఎస్, జగన్( Jagan) నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్. 2014లో విపక్షంలో ఉన్న వైసిపి దూకుడు తగ్గించలేదు. 2019లో అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు కెసిఆర్ సర్కార్ నడిచింది. అయితే ముందుగా అధికారాన్ని కోల్పోయారు కెసిఆర్. తరువాత అధికారాన్ని పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఇద్దరు మాజీలు అయ్యారు. రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?

* అలా స్నేహం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. జగన్మోహన్ రెడ్డి స్నేహ హస్తం అందుకున్నారు కేసీఆర్. చంద్రబాబు( Chandrababu) మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కెసిఆర్ కు సరిపెట్టారు. ఇది నచ్చని కేసీఆర్ బయటకు వచ్చి ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారు. అది అంతిమంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి లాభం చేసింది. అయితే కార్యక్రమంలో అదే రాజశేఖరరెడ్డి కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ను బలహీనం చేయాలని చూశారు. అలా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. అయితే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబును చూశారు కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రత్యేక పార్టీని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఈ ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు మారారు. అందుకే గత దశాబ్ద కాలం పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకొని రాజకీయాలు నడిపారు ఆ ఇద్దరు. కానీ ఇప్పుడు చంద్రబాబు వారిద్దరి పై చేయి సాధించారు.అందుకే ఉమ్మడి వ్యూహరచనకు పదును పెడుతున్నారు కేసీఆర్, జగన్.

* ఎట్టకేలకు కేసీఆర్..
తెలంగాణలో కెసిఆర్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. కెసిఆర్ పార్టీ మాత్రం గౌరవప్రదమైన ప్రతిపక్షానికి పరిమితం అయింది. అయితే కెసిఆర్ శాసనసభకు హాజరు కావడం లేదు. గత రెండేళ్లలో ఒకసారి మాత్రమే శాసనసభకు వచ్చారు. అయితే వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమావేశంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించి.. కెసిఆర్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉంది. దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలంటే కెసిఆర్ తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. అందుకే ఈ సమావేశాలకు కెసిఆర్ హాజరవుతారని తెలుస్తోంది.

* జగన్ సైతం..
మరోవైపు ఏపీకి సంబంధించి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సైతం ముహూర్తం నిర్ణయించారు. ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వైసిపి హయాంలో భారీగా అవినీతి, దోపిడీ జరుగుతోందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అందుకే అసెంబ్లీ వేదికగా వాటికి చెక్ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో శాసనసభ సమావేశాలకు జగన్ హాజరు కావడం లేదు. అయితే ఇప్పుడు కెసిఆర్ సలహాతోనే జగన్ సభకు హాజరు కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Leave a Comment