iPhone Chassis Unit in Andhra Pradesh : ‘బాబు’ గారు సీఎంగా ఉంటే అన్నీ అలా అయిపోతాయి అంతే.. ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరీ.. కొండలు, గుట్టలున్న బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లో ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబుది.. ఐటీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణకు ఆయువు పట్టుగా మార్చడంలో బాబు కృషి ఉందనేది అందరి మాట.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ను డెవలప్ చేసిన చంద్రబాబుకు దేశ, విదేశీ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంచి సత్సబంధాలున్నాయి. ఆ పరిచయాలే నేడు రాజధాని కూడా లేని ఆయువుపట్టులా నిలుస్తున్నాయి.. బాబు చొరవ.. పారిశ్రామికవేత్తల తోడ్పాటుతో ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా భూములు, అనుమతులు, ఇతర సదుపాయాలను కల్పిస్తూ..రాయితీలు ఇస్తూ ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు మళ్లీ నిత్య కృశీవలుడిగా మారుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ ఏపీకి గొప్ప కంపెనీలను పట్టుకొస్తున్నాడు. తద్వారా ఉద్యోగ, ఉపాధికి బాటలు వేస్తున్నాడు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ ఐఫోన్ తయారీకి బేస్ గా ఆంధ్రప్రదేశ్ మార్చే గొప్ప ముందడుగు పడింది. దీనిపై స్పెషల్ ఫోకస్..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల రంగం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రముఖ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ కుప్పంలో రూ. 586 కోట్లతో ఒక అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం ఛాసిస్‌లు నేరుగా ఐఫోన్ తయారీలో ఉపయోగించబడతాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ పేరు అంతర్జాతీయ ఐఫోన్ సప్లై చైన్‌లో చేరబోతోంది.
– ప్రాజెక్ట్ కుప్పంలో ఎందుకు?
ఈ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో స్థాపించడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. కుప్పం భౌగోళికంగా ఒక త్రి-రాష్ట్ర కూడలి. ఇది కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల మౌలిక సదుపాయాలకు సులభంగా అనుసంధానం అవుతుంది. వాస్తవానికి కుప్పం నుండి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న దూరం, బెంగళూరు నగరం నుండి ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న దూరం కంటే తక్కువగా ఉంది. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది.
– ఐఫోన్ ఎకోసిస్టమ్‌లో దక్షిణ భారతదేశం
ఇప్పటికే బెంగళూరుకు సమీపంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పుడు కుప్పంలో హిందాల్కో అల్యూమినియం ఛాసిస్ యూనిట్ రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్-తమిళనాడు-కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల త్రిభుజం, చైనా వెలుపల ఆపిల్‌కి రెండో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది దేశానికి టెక్నాలజీ తయారీలో స్వయంప్రతిపత్తిని పెంచుతుంది.
– ఉద్యోగ అవకాశాలు.. నాణ్యత ముఖ్యం
ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే నాలుగేళ్లలో 613 ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ సంఖ్య పెద్దది కాకపోయినా ఈ ఉద్యోగాలు హై-ఎండ్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉండటం వల్ల వాటి నాణ్యత పెరిగింది. సాధారణ కార్మిక పనులు కాకుండా నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుకు అవసరం. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాభివృద్ధికి, నైపుణ్య అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
– ప్రభుత్వ విధానం – భవిష్యత్తు ప్రణాళికలు
చంద్రబాబు ముందు నుంచి అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తుడు. ఆయనకు విజన్ ఉంది. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో అందెవేసిన చేయి. హైదరాబాద్ కు ఐటీని తీసుకొచ్చి ఇప్పుడు దేశ జీడీపీలో తెలంగాణను టాప్ స్థానాల్లో నిలిపారంటే అది చంద్రబాబు ఘనతనే. ఇప్పుడు ఏపీకి కూడా వీలైనన్నీ ప్రాజెక్టులు తీసుకొస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు. ఏపీ ప్రభుత్వం ఈ హిందాల్కో ప్రాజెక్ట్‌ను ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఆమోదించబోతోంది. ఇందులో భాగంగా భూ రాయితీలు, పన్ను సడలింపులు వంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించడానికి ఇది దోహదం చేస్తుంది. హిందాల్కోతో పాటు, సైరమా SGS టెక్నాలజీ కూడా రూ. 1,800 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) , కాపర్ క్లాడ్ లామినేట్ (CCL) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ రెండు ప్రాజెక్టులు కలిపి చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక “కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్”గా రూపాంతరం చెందుతోందని స్పష్టమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌కు ఇది కేవలం ఒక పరిశ్రమ కాకుండా ఒక ప్రతిష్టాత్మకమైన అవకాశంగా నిలుస్తుంది. ఆపిల్ వంటి ప్రపంచ బ్రాండ్ సరఫరా గొలుసులో భాగం కావడం ద్వారా రాష్ట్రానికి ఒక కొత్త గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో లాజిస్టిక్స్, అసెంబ్లీ , ఇతర సపోర్ట్ సర్వీసెస్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కుప్పంలో ప్రారంభమవుతున్న ఈ హిందాల్కో యూనిట్ ఆంధ్రప్రదేశ్‌కి టెక్నాలజీ తయారీ ప్రపంచంలో ఒక బంగారు ద్వారంగా మారనుంది. ఫాక్స్‌కాన్, హిందాల్కో, సైరమా SGS వంటి ప్రాజెక్టులు కుప్పాన్ని భవిష్యత్తులో దక్షిణ భారతదేశ సిలికాన్ వ్యాలీగా మార్చే అవకాశం ఉంది.