ABN Andhra Jyothi TRP Rating: అప్పుడెప్పుడో మీడియా అనేది న్యూట్రల్ గా ఉండేది. సమాజ హితం కోసం పని చేసేది. అడ్డదారులు తొక్కే వ్యక్తులను.. అడ్డదిడ్డంగా మారిన వ్యవస్థలను చర్నాకోల్ తో కొట్టేది. ఒక రకంగా సమాజాన్ని సరైనదారిలో పెట్టడానికి తన వంతు పాత్ర పోషించేది. ఇందువల్లే మీడియా అంటే జనాల్లో అప్పుడు విపరీతమైన నమ్మకం ఉండేది. మీడియాలో పనిచేసే వ్యక్తులంటే విపరీతమైన గౌరవం ఉండేది. కాలం మారింది. మీడియా కూడా మారింది. సమాజ హితం నుంచి పక్కా వ్యాపార కోణం అనే స్థాయికి మీడియా దిగజారింది. మీడియాలోకి రకరకాల వ్యక్తులు రావడంతో రాజకీయ రంగులు కూడా పూసుకుంది. తద్వారా మీడియా అనేది పొలిటికల్ మౌత్ పీస్ గా మారిపోయింది. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో మీడియా హౌస్ ఏర్పాటు చేయడంతో.. దేనిని నమ్మాలో.. నమ్మకూడదో ప్రజలకు తెలియకుండా పోయింది.
Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు
ఒక్కో మీడియా హౌస్ ఒక్కో రాజకీయ పార్టీకి మౌత్ పీస్ అని చెప్పుకున్నాం కదా.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు కూడా గత్యంతరం లేక ఆ చానల్స్ చూస్తున్నారు. ఇక తెలుగు నాట ఎప్పటినుంచో టీవీ9 మొదటి స్థానంలో ఉంది. గతంలో ఎన్టీవీ టీవీ9 స్థానాన్ని ఆక్రమించినప్పటికీ.. ఆ ఆనందం కొంతకాలం మాత్రమే ఉంది. ఆ తర్వాత టీవీ9 మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చేసింది. రెండవ స్థానంలోకి పడిపోయిన తర్వాత టీవీ9 శోకాలు పెట్టింది. కుట్రలతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించలేరని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అనంతరం మొదటి స్థానంలోకి వచ్చిన తర్వాత టీవీ9 సైలెంట్ అయిపోయింది. ఇక ఎన్టీవీ తన రెండవ స్థానాన్ని కాపాడుకుంటూనే ఉంది. టీవీ5 మూడో స్థానాన్ని ఆక్రమించింది. గతంలో టీవీ5 స్థానంలో వి6 ఉండేది. ఎందుకనో వీ6 ఇప్పుడు కిందకి పడిపోయింది. ఆశ్చర్యకరంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నాలుగో స్థానానికి వచ్చింది. టిడిపి జెండా మోస్తూ.. టిడిపి డప్పు కొట్టే ఈ ఛానల్ నాలుగో స్థానానికి రావడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది.
ఇదే తొలిసారి
ఏబీఎన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ స్థానంలోకి రావడం ఇదే తొలిసారి. ఇంత వైసిపి అధికారిక మౌత్ పీస్ సాక్షి ఏడో స్థానంలో ఉంది.. 10 టీవీ, వీ6 న్యూస్ చానల్స్ 5, 6 స్థానాలకు పడిపోయాయి.. ఏబీఎన్ ఏపీలో మూడో స్థానంలో ఉండగా.. తెలంగాణలో నాలుగో స్థానంలో ఉంది. అయితే హైదరాబాద్ పరిధిలో మాత్రం మూడో స్థానంలో ఉంది. పత్రికల్లో ఏబిసి రేటింగ్స్ మాదిరిగానే.. న్యూస్ ఛానల్స్ లో బార్క్ రేటింగ్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో ఎంతవరకు నైతికత ఉంటుంది? ఎంతవరకు పారదర్శకత సాధ్యమవుతుందనేది? ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు. ఆ మధ్య రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మధ్య జరిగిన యుద్ధం తెలిసిందే కదా. ఈ వ్యవహారంలో అర్నబ్ గోస్వామి ఏగంగా కోర్టు ద్వారా వెళ్ళాడు. ఏది ఏమైనప్పటికీ ఏబీఎన్ విషయంలో రాధాకృష్ణ నక్కతోక తొక్కినట్టే. ఎందుకంటే ఆయన పత్రిక మూడోస్థానంలో ఉంది. చివరికి ఛానల్ కూడా మూడో స్థానానికి చేరుకుంది.