స్వదేశీ పత్తిరైతుపై పిడుగు

ఎగుమతులపై ట్రంప్‌ 50 శాతం సుంకాలు
విదేశీ పత్తిపై టారిఫ్‌ రద్దు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత
ఉపాధికి పెనుముప్పు
కుదేలవుతున్న టెక్స్‌టైల్‌ రంగం
న్యూఢిల్లీ :
దేశంలో ‘తెల్ల బంగారం’గా పిలుస్తున్న పత్తి ఒకప్పుడు రైతన్న ఇంట సిరుల పంట పండించేది. భారతావనిలో అరవై లక్షల మంది రైతులకు జీవనాధారంగా, నాలుగున్నర కోట్ల మంది వస్త్ర పరిశ్రమ కార్మికుల పాలిట కల్పతరువుగా, దుస్తుల పరిశ్రమకు ఆలంబనగా నిలుస్తూ మన చేనేత వారసత్వాన్ని దశదిశలా వ్యాపింపజేసిన పత్తి ఇప్పుడు కేవలం ఓ సాధారణ పంటగా మాత్రమే మిగిలిపోతోంది. దీనితో రైతాంగ జీవనాధారం ప్రమాదంలో పడిపోయింది. ఈ విపత్కర పరిస్థితులకు కచ్చితంగా కేంన్రద ప్రభుత్వ విధానాలే కారణంగా నిలుస్తున్నాయి. ఈ నెల 6న అమెరికా ప్రభుత్వం భారతదేశ వస్త్ర ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించింది. దీంతో పత్తి రైతులు, స్పిన్నర్లు, చేనేత కార్మికుల భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. పుండు మీద కారం చల్లినట్టు కేంద్ర ప్రభుత్వం విదేశీ పత్తి దిగుమతులపై విధిస్తున్న 11 శాతం టారిఫ్‌ను రద్దు చేయడంతో పత్తి రైతు సహా వస్త్ర పరిశ్రమ యావత్తూ బెంబేలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం టారిఫ్‌ల ఎత్తివేత ఈ నెల 19వ తేదీనే అమలుల్లోకి వచ్చింది. టారిఫ్‌ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్‌ 30వ వరకూ కొనసాగుతుందని కేంద్రం తాత్కాలిక ప్రకటన చేసింది.

పడిపోతున్న ధర
దిగుమతి సుంకాలు రద్దు చేయడంతో ఆస్ట్రేలియా, ఈజిప్ట్‌ వంటి ఇతర దేశాల నుంచి చౌకగా పత్తి భారత్‌లోకి వచ్చి పడుతోంది. ఓ వైపు అమెరికా సుంకాలు, మరో వైపు ధరల పతనంతో స్వదేశీ పత్తి రైతులు అవస్థలు పడుతుంటే కేంద్రం వారి ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి మరింత కష్టాల కడలిలోకి నెట్టేసింది. దిగుమతి సుంకాల రద్దు ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కన్పిస్తోంది. సుంకాలను రద్దు చేసిన కొద్ది రోజులకే దేశంలో పత్తి ధర నాలుగు శాతం పడిపోయింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తన బెంచ్‌మార్క్‌ ధరను బేలుకు రూ.1,100 తగ్గించింది. పత్తి రైతులు ఇప్పటికే కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంటను తెగనమ్ముకుంటున్నారు.

దిగుబడులు డౌన్‌… దిగుమతులు హై
కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షల మంది రైతుల పరిస్థితి ప్రమాదంలో పడింది. దేశం నుంచి రూ.74,648 కోట్ల విలువైన పత్తి, దుస్తులు అమెరికాకు ఎగుమతి అవుతుండగా, ట్రంప్‌ ప్రభుత్వం విధించిన అధిక సుంకాల కారణంగా అవి గణనీయంగా తగ్గుతున్నాయి. ఇప్పటికే దేశంలో పత్తి దిగుమతి గత దశాబ్ద కాలంలో 24 శాతం పడిపోయింది. మరోవైపు దిగుమతులు 73 శాతం పెరిగాయి. భారతీయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్న 35 లక్షల మంది చేనేత కార్మికులు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మిల్లులు నూలు కొనుగోలును తగ్గించడమే దీనికి కారణం. ట్రంప్‌ ప్రభుత్వ సుంకాల దెబ్బకు భారతదేశం రూ.2.17 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను కోల్పోతుంది. ఈ భారంలో వస్త్ర పరిశ్రమే సుమారు సగం భరించాల్సి వస్తుంది.

సంక్షోభం తప్పదు
భారతావనిలో ప్రతి రోజూ 31 మంది రైతులు లేదా వ్యవసాయ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పత్తి ధరల పతనంతో ఈ సంక్షోభం విపత్తుగా మారే ప్రమాదం లేకపోలేదు. భారతీయ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతటి వ్యక్తిగత మూల్యాన్ని అయినా చెల్లించుకుంటానని ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ చెప్పారు. కానీ రైతులకు ఇప్పుడు కావాల్సింది ఇలాంటి సూక్తులు కావు. వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించే గిట్టుబాటు ధరలు కావాలి. స్వామినాథన్‌ కమిషన్‌ యొక్క సీ2 ప్లస్‌ యాభై శాతం ఫార్ములా ప్రాతిపదికన కనీస మద్దతు ధరను అందించాలని రైతాంగం కోరుతోంది. అంటే క్వింటాలుకు రూ.10,075 అడుగుతున్నారు. కానీ మార్కెట్లో మధ్యస్థ పొడవు కలిగిన పత్తి పంటకు రూ.7,710 మాత్రమే పొందుతున్నారు. అంటే క్వింటాలు ధరలో రూ.2,365 వ్యత్యాసం కన్పిస్తోంది.

ఉపాధికి ఎసరు
ఓ వైపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మంత్రాన్ని పఠిస్తూ మరోవైపు విదేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులను ఆహ్వానించడంపై దేశ రైతాంగం, యువతరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చౌక దిగుమతులను అనుమతిస్తే లాభపడేది రైతులు, చేనేత కార్మికులు కాదనీ, కేవలం వ్యాపారులు, దిగుమతిదారులు మాత్రమే ప్రయోజనం పొందుతారని చెప్తున్నారు. పత్తి పంట, వస్త్ర పరిశ్రమ…ఈ రెండూ దేశంలో అతి పెద్ద యాజమాన్యాలు. నాలుగున్నర కోట్ల మందికి బతుకుదెరువు చూపిస్తున్నాయి. 2024-25లో మన దేశం నుంచి అమెరికాకు రూ.74,648 కోట్ల విలువైన పత్తి నూలు, దుస్తులు, వస్త్రాలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ట్రంప్‌ సుంకాలతో ఇవి సగానికి సగం పడిపోతాయి. ఫలితంగా రాబోయే నెలల్లో లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అంచనా.

ఏం చేయాలంటే…
భారత పత్తి సంక్షోభం అనివార్యమైనదేమీ కాదు. అది రాజకీయాలతో ముడిపడింది. సమస్యను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. స్వామినాథన్‌ ఫార్ములా ఆధారంగా రైతులకు గ్యారంటీతో కూడిన గిట్టుబాటు ధర కల్పించడం, సేకరణకు గట్టి హామీ ఇవ్వడం వంటి చర్యలు తప్పనిసరి. దీనికితోడు ఎగుమతి మార్కెట్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతుండడమే మన కొంప ముంచుతోంది. కాబట్టి ఆసియా నుంచి ఆఫ్రికా వరకూ కొత్త మార్కెట్లను అన్వేషించాలి. టారిఫ్‌ దెబ్బ నుంచి ఎగుమతిదారులకు రక్షణ కల్పించాలి. పత్తిని ఎక్కువగా పండిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలకు సహాయ ప్యాకేజీలు కల్పించాలి. అంటే ప్రత్యక్ష నగదు బదిలీలు, రుణ మాఫీలు, రాయితీ రేట్లతో అవసరమైన రుణాల కల్పన వంటి చర్యలు చేపట్టాలి.

The post స్వదేశీ పత్తిరైతుపై పిడుగు appeared first on Navatelangana.

Leave a Comment