చిన్నగా కనిపించే పుట్టగొడుగులు పోషకాల గని. వీటిలో విటమిన్లు, సెలీనియం, పొటాషియం లాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కేవలం రుచి కోసమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ఉదయం లేవగానే అలసిపోయినట్లు అనిపిస్తుందా.. బహుశా మీ శరీరంలో బి-విటమిన్లు తక్కువగా ఉండవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ B2, B3, పాంతోథెనిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి.. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా హార్మోన్లు సరిగ్గా తయారవ్వడానికి కూడా సహాయపడతాయి. అందుకే ఉదయాన్నే పుట్టగొడుగులు తింటే అలసట తగ్గి రోజు మొత్తం చురుగ్గా ఉంటారు.
శాఖాహారులకు వరం
పుట్టగొడుగుల్లో సెలీనియం అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా చేపలు, మాంసం వంటి వాటిలో మాత్రమే దొరుకుతుంది. ఈ సెలీనియం మన శరీరంలోని కణాలను కాపాడడం, రోగనిరోధక శక్తిని పెంచడం, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి శాఖాహారం తీసుకునే వారికి పుట్టగొడుగులు చాలా ఉపయోగపడతాయి.
పొటాషియం పవర్ హౌస్
అరటిపండ్లలోనే ఎక్కువ పొటాషియం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ పుట్టగొడుగుల్లో కూడా ఈ ఖనిజం బాగా ఉంటుంది. పొటాషియం శరీరంలోని నీటి సమతుల్యాన్ని కాపాడి.. కండరాలను బలంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కళ్ళు ఎర్రబడడం, కండరాల తిమ్మిరి వంటివి పొటాషియం లోపానికి సంకేతాలు. వీటిని తగ్గించడానికి పుట్టగొడుగులు తినడం మంచిది.
ప్రకృతి ఇచ్చిన మల్టీవిటమిన్
పుట్టగొడుగుల్లో రాగి, ఐరన్, సెలీనియం వంటివి కలిసి లభిస్తాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాలు తయారవ్వడానికి.. ఐరన్ సరిగ్గా అందడానికి సహాయపడతాయి. అందుకే పుట్టగొడుగులను ప్రకృతి ఇచ్చిన చిన్న మల్టీవిటమిన్ అని అనవచ్చు.
జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్
పుట్టగొడుగుల్లో గ్లూటాతియోన్, ఎర్గోథియోనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు త్వరగా ముసలివి అవ్వకుండా.. వ్యాధులు రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఎర్గోథియోనిన్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లితో కలిపి పుట్టగొడుగులు తింటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
మంచి డైజెషన్ కోసం
పుట్టగొడుగుల్లో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియ సులభంగా అయ్యేలా చేస్తుంది. క్రమం తప్పకుండా తింటే కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
పుట్టగొడుగులు కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించే అద్భుతమైన ఆహారం. అలసట తగ్గించుకోవాలన్నా, జ్ఞాపకశక్తి పెంచుకోవాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా వీటిని మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
[