వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరి కాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యక్తమవుతుండగా…వాన్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడిరది. యూఎస్‌ఏ టుడేతో మాట్లాడిన జేడీ వాన్స్.. ట్రంప్ ఆరోగ్యంపై మాట్లాడారు. ‘అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వచ్చిన వార్తలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించినమాట నిజమే కానీ అందులో వాస్తవం లేదు. ట్రంప్ ప్రస్తుతం ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ, వాటన్నింటినీ దాటుకొని తన పదవీ కాలాన్ని ట్రంప్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
