Man Mums in China: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఒంటరితనం పెరిగిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు దూరమవుతున్నాయి. దీంతో కష్టమొచ్చినా.. కన్నీళ్లు వచ్చినా ఓదార్చేవారు కరువవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా కుటంబం అంతా అండగా నిలిచేది. దగ్గరకు తీసుకుని ఓదార్చేది. ఒక్క హగ్(కౌగిలింత)లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఓదార్పు, ధైర్యం భరోసా అన్నీ దక్కువి. కానీ ఇప్పుడు ఇలా ఓదార్చేవారే కరువవుతున్నారు. హగ్ను ఇప్పుడు కేవలం శృంగారంలో ఒక భాగంగానే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో చైనాలో ఒక వినూత్న ధోరణి మొదలైంది. యువతులు మానసిక శాంతి, భావోద్వేగ సాంత్వనం కోసం ‘మ్యాన్ మమ్స్’ అనే వ్యక్తుల నుంచి ఐదు నిమిషాల కౌగిలిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు 50 యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ. 600 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ‘మ్యాన్ మమ్స్’ ట్రెండ్ సమాజంలోని భావోద్వేగ అవసరాలను, మానసిక ఒత్తిడి సవాళ్లను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలింగనాలతో శారీరక స్పర్శ కంటే ఎక్కువగా, ఓదార్పు, భరోసాను అందిస్తున్నాయి.
‘మ్యాన్ మమ్స్’.. ఒక కొత్త భావన
‘మ్యాన్ మమ్స్’ అనే పదం మొదట జిమ్లో వ్యాయామం చేసే దృఢకాయ యువకులను సూచించేది. అయితే, ఈ భావన ఇప్పుడు శారీరక దృఢత్వంతో పాటు సౌమ్యత, ఓపిక, భావోద్వేగ సున్నితత్వం కలిగిన వ్యక్తులను సూచిస్తోంది. ఈ వ్యక్తులను యువతులు వారి మర్యాద, శాంత స్వభావం, ఆకర్షణీయ రూపం ఆధారంగా ఎంచుకుంటున్నారు. ఈ ఆలింగన సేవలు సామాజిక మాధ్యమాలు, చాట్ యాప్ల ద్వారా ఏర్పాటు చేయబడి, సాధారణంగా షాపింగ్ మాల్స్, సబ్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి. ఈ ఆలింగనాలు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో జరిగేలా చూస్తారు.
ఒత్తిడి నుంచి ఉపశమనం..
చైనాలోని యువతులు, ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు, అకాడమిక్ ఒత్తిడి, పని ఒడిదొడుకులు, శరీర ఆకృతి గురించిన ఆందోళనల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘మ్యాన్ మమ్స్’ నుంచి ఆలింగనం పొందడం వారికి తాత్కాలిక భావోద్వేగ ఉపశమనాన్ని అందిస్తోంది. ఒక విద్యార్థిని తన థీసిస్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కౌగిలి కోసం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం వైరల్గా మారి, ఈ ధోరణికి బీజం వేసింది. ఈ ఆలింగనాలు కేవలం శారీరక స్పర్శ కంటే, ఒక అపరిచితుడి నుంచి వచ్చే ఆత్మీయత, సానుభూతిని అందిస్తాయని యువతులు చెబుతున్నారు.
ఆలింగనం అందించే యువకులు..
‘మ్యాన్ మమ్స్’ సేవలను అందించే యువకులు ఈ అనుభవం తమకు స్వీయ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెబుతున్నారు. జౌ అనే యువకుడు 34 ఆలింగనాల ద్వారా సుమారు రూ.21,000 సంపాదించాడు. అతను ఈ సేవను పూర్తి సమయ ఉపాధిగా కాకుండా, భావోద్వేగ సరిహద్దులను నిర్వహించడానికి ఒక చిన్న రుసుము వసూలు చేస్తాడు. ఈ యువకులు తమ రూపాన్ని ఆకర్షణీయంగా ఉంచడానికి మేకప్, పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తూ, ఆలింగన అనుభవాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి శ్రద్ధ తీసుకుంటారు. ఈ సేవలు గౌరవప్రదంగా, స్పష్టమైన సరిహద్దులతో జరుగుతాయని వారు నొక్కి చెబుతున్నారు.
ఈ ‘మ్యాన్ మమ్స్’ ధోరణి సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. కొందరు దీనిని మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే సృజనాత్మక మార్గంగా భావిస్తుండగా, మరికొందరు దీనిని శృంగార ఆకాంక్షలకు ముసుగుగా ఉండవచ్చని, లైంగిక వేధింపులకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవలు బహిరంగ ప్రదేశాల్లో జరగడం, రుసుము చెల్లింపు వల్ల స్పష్టమైన సరిహద్దులు ఏర్పడడం వల్ల ఈ ఆలింగనాలు సురక్షితమని యువతులు చెబుతున్నారు. బంధాలు, అనుబంధాలు దూరమైతే, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతే.. ఓదార్చేవారు లేకపోతే ఈ ట్రెండ్ త్వరలో మన దేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే యాంత్రిక జీవనానికి అలవాటు పడకుండా.. బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాంటున్నారు నిపుణులు. కుటుంబాలకు కొంత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు.
[