క్యూ1లో 7.8 శాతం పెరుగుదల
ఆర్బీఐ, ఐఎంఎఫ్ అంచనాల కంటే ఎక్కువ
నవతెలంగాణ – బిజినెస్ డెస్క్
దేశంలో అధిక ధరలతో ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ ప్రగతికి గీటురాయిగా భావించే వాహన అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మరోవైపు డిమాండ్ లేక తయారీ రంగం వెలవెల పోతుండటంతో పారిశ్రామికోత్పత్తి నేల చూపులు చూస్తోంది. అయినప్పటికీ.. భారత స్థూల దేశీయ్పోత్తి (జీడీపీ) పరుగులు పెట్టడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, రేటింగ్ ఎజెన్సీల అంచనాలు మించి వృద్ధి చోటు చేసుకుందని కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన రిపోర్ట్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంకెలేగా.. వేసెరు.. అన్నట్టుగా మోడీ సర్కార్ గణంకాల ఉండటం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో భారత జీడీపీ 7.8 శాతం పెరిగిందని కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గడిచిన ఐదు త్రైమాసికాలలోనే అత్యధికమని తన రిపోర్ట్‌లో పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ నమోదయ్యిందని గుర్తు చేసింది. గడిచిన జూన్ త్రైమాసికంలోనూ అదే విధంగా 2025-26 పూర్తి ఏడాదిలోనూ భారత జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని ఈ నెల ప్రారంభంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ అంచనా వేసింది. దీంతో పోల్చితే భారీగా పెరగడం విశేషం. ”2025-26 జూన్ త్రైమాసికంలో స్థిర ధరల వద్ద జీడీపీ 7.8 శాతం పెరిగి రూ.47.89 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2024-25 ఇదే త్రైమాసికంలో జీడీపీ రూ.44.42 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది.” అని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది.
రంగాల వారీగా..
గడిచిన జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం 3.7 శాతం పెరిగింది. ఈ రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 1.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో గనుల రంగం 6.6 శాతం వృద్ధిని కనబర్చగా.. గడిచిన త్రైమాసికంలో 3.1 శాతానికి మందగించింది. క్రితం క్యూ1లో తయారీ రంగం 7.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో 7.6 శాతంగా ఉంది. 2025-26 జూన్ త్రైమాసికంలో వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్స్, సర్వీసెస్ రంగాలు 8.6 శాతం పెరిగాయి. ఈ రంగాల వృద్ధి గతేడాది క్యూ1లో 5.4 శాతంగా నమోదయ్యింది. ఇదే సమయంలో ఫైనాన్సియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 6.6 శాతం పెరగ్గా.. గడిచిన క్యూ1లో ఏకంగా 9.5 శాతం పెరిగినట్టు ప్రభుత్వ గణంకాలు ధ్రువీకరిస్తున్నాయి. క్రితం జూన్ త్రైమాసికంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగాలు 9.8 శాతం వృద్దిని నమోదు చేశాయి. ఈ రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 9 శాతం పెరుగుదలను చూపింది. గడిచిన త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 52 శాతం పెరగడం వృద్ధికి ప్రధాన మద్దతును అందించిందని గణంకాల శాఖ పేర్కొంది. నిర్మాణ, వ్యవసాయ రంగాలు మెరుగైన ప్రగతిని కనబర్చాయని తెలిపింది.
ప్రజల వద్ద పైసల్లేవ్..
ప్రజల ఆదాయాల్లో పెద్ద మార్పు లేదు. డిమాండ్ లేక తయారీ రంగం వెలవెలబోతోంది. కొనుగోళ్లతో స్థబ్దత చోటు చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)తో పాటు గడిచిన జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజరు మల్హోత్రా ఇటీవల స్వయంగా చెప్పారు. భారత వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్, 6.4 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లు అంచనా వేశాయి. అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్‌అండ్‌పీ) భారత వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 6.3-7 శాతంగా ఉండొచ్చని ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన పోల్‌లో 14 మంది ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ అంచనాలకు మించి ఊహకందని స్థాయిలో కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ 7.8 శాతం వృద్ధిని ప్రకటించి మొత్తం నిపుణులు, పరిశ్రమ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తిరోగమనంలో పారిశ్రామికోత్పత్తి..?
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, సిమెంట్, స్టీల్, ఎరువులు తదితర ఎనిమిది రంగాల ఉత్పత్తి ఇటీవల పడక వేశాయని స్వయంగా ప్రభుత్వ గణంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై కాలంలో ఈ రంగాలు కేవలం 1.6 శాతం పెరుగుదలకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 6.3 శాతం వృద్ధిని కనబర్చాయి. 2024 జూన్ మాసంలో ఈ రంగాలు 6.3 శాతం శాతం పెరుగుదలను నమోదు చేయగా.. 2025 జూన్‌లో ఏకంగా 2 శాతానికి క్షీణించాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది కీలక రంగాల వాటా ఏకంగా 40.27 శాతంగా ఉందంటే వీటి ప్రాధాన్యత స్పష్టం అవుతోంది. మరోవైపు ఈ ఏడాది జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఏకంగా 1.5 శాతానికి పతనమై 10 నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యిందని సర్కార్ లెక్కలు స్పష్టం చేస్తోన్నాయి. 2025-26 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 5.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వాహన అమ్మకాలు 5.1 శాతం క్షీణించి 60,74,874 యూనిట్లకు పరిమితమయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్‌్‌స (సియోమ్) ఇటీవల వెల్లడించింది.
The post అంకెలేగా.. వేసెరు! appeared first on Navatelangana.