Vinayaka In Revanth Reddy Getup: దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఊరూరా.. వాడ వాడల గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు వినాయక మండపాల్లు భారీ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇక మండపానికో తీరుగా ఆదిదేవుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి ఆపరేషన్ సిందూర్ రూపంలో తయారు చేసిన గణపతి విగ్రహాలు దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలోని హబీబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం ఇపుపడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన మతపరమైన భావాలను కలవరపరిచిన నేపథ్యంలో పోలీసులు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
రేవంత్ రెడ్డి గెటప్‌లో విగ్రహం
గణేశ్ చతుర్థి సందర్భంగా హబీబ్‌నగర్‌లో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుస్తులైన తెల్లని చొక్కా, నలుపు ప్యాంటు, ఆకుపచ్చ శాలువాతో ‘తెలంగాణ రైజింగ్‘ థీమ్‌తో రూపొందించబడింది. ఈ విగ్రహం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలోని ఒక ఫోటోను ఆధారంగా చేసుకుని తయారు చేశారు. ఈ విగ్రహం రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యమంత్రి దార్శనికతను సూచిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నప్పటికీ, ఇది మతపరమైన భావాలను గాయపరిచే చర్యగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.
పోలీసులకు ఫిర్యాదు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఈ విగ్రహం హిందూ భావనలను గాయపరిచిందని, రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కానీ దేవత కాదని వాదిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు లేఖ రాశారు. ఈ విగ్రహం హిందూ సమాజంలో అసంతృప్తిని కలిగించిందని, మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజా సింగ్ ఫిర్యాదు తర్వాత, సౌత్ వెస్ట్ డీసీపీ ఈ పండపాన్ని సందర్శించి, మత భావనలను గౌరవించాలని నిర్వాహకుడు సాయి కుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగించబడి, దాని స్థానంలో సాంప్రదాయ రూపంలో మరొక విగ్రహం ఏర్పాటు చేశారు.
ఈ వివాదం రాజకీయ మరియు సామాజిక కోణాలను కూడా బహిర్గతం చేస్తుంది. మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా, ఈ విగ్రహం ద్వారా రేవంత్ రెడ్డి నాయకత్వం, తెలంగాణ అభివృద్ధిని ప్రచారం చేయాలని భావించారు. అయితే, రాజా సింగ్ ఫిర్యాదు ఈ చర్యను మత భావనలకు విరుద్ధంగా చిత్రీకరించింది, ఇది రాజకీయ ఉద్దేశాలతో కూడిన వివాదంగా మారింది. గతంలో రాజా సింగ్ హిందూ సంస్థల తరపున విగ్రహ విధ్వంసం వంటి సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.