Vangaveeti Radhakrishna: తెలుగుదేశం( Telugu Desam) కూటమి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మరోవైపు టిడిపి తో మైత్రి విషయంలో పవన్ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. టిడిపి విషయంలో బాహటంగా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు కూడా. చివరకు రాజకీయ ప్రకటనలు చేయడంలో దూకుడుగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు సైతం చాలా నియంత్రణగా మాట్లాడుతున్నారు. పార్టీ శ్రేణులను నియంత్రిస్తున్నారు. రాష్ట్రంలో ఏ విషయంలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది కూటమి. చివరకు నేతలకు పదవులు ఇవ్వడంలో ఒక ఫార్ములాను అనుసరిస్తోంది. అందులో భాగంగా వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి.. కాపు సామాజిక వర్గానికి సరైన సంకేతం ఇవ్వాలని చూస్తోంది.
Also Read: విశాఖలో పవన్ పెద్ద గేమ్ ప్లాన్!
* చిన్న వయసులోనే అసెంబ్లీకి..
వంగవీటి మోహన్ రంగా ( vangaveeti Mohan Ranga )వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధాకృష్ణ. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 2004లో తొలిసారిగా రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయింది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి తరుపున ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు తప్పకుండా పదవి దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఎటువంటి ఛాన్స్ లేకుండా పోయింది.
* ఎన్నికలకు ఏడాది ముందు..
అయితే వంగవీటి రాధాకృష్ణకు( vangaveeti Radha Krishna ) పదవి ఇప్పుడే కాదని తెలుస్తోంది. ఇటీవల వంగవీటి మోహన్ రంగ విగ్రహాలపై దాడి ఘటనలు జరిగాయి. ఆ సమయంలో స్పందించారు వంగవీటి రాధాకృష్ణ. విగ్రహాలకు అభిషేకాలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆవేదనతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వంగవీటి కుమారుడు అన్న బ్రాండ్ చాలునని వ్యాఖ్యానించారు. అయితే రాధా విషయంలో కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్సీగా తీసుకొని.. అవసరం అనుకుంటే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గాన్ని మరింతగా యాక్టివ్ చేసి.. 2029 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ఏం జరుగుతుందో..