ఐపీఎల్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన సంజీవ్ గోయెంకా లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు ఇప్పుడు కొంత రిలీఫ్ లభించింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్లో గోయెంకాకు చెందిన మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టుకు ఇది మూడవ విజయం మాత్రమే. 30వ లీగ్ మ్యాచ్‌లో.. కావ్య మారన్ జట్టు అయిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌పై మాంచెస్టర్ ఒరిజినల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్, న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్రల అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్. వీరిద్దరూ కేవలం 48 బంతుల్లోనే మ్యాచ్‌ను తిప్పేశారు.
బట్లర్, రవీంద్రల వీరవిహారం
140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు శుభారంభం దక్కలేదు. కేవలం 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జోస్ బట్లర్, రచిన్ రవీంద్రలు కలిసి మూడో వికెట్‌కు 48 బంతుల్లో 99 పరుగుల మెరుపు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో బట్లర్ కేవలం 37 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 70 పరుగులు చేసి జట్టు విజయాన్ని సులభం చేశాడు. బట్లర్‌కు అండగా నిలిచిన రచిన్ రవీంద్ర 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ఫిల్ సాల్ట్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరికి మాంచెస్టర్ జట్టు 16 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ బౌలర్లలో జాకబ్ డఫీ, రషీద్ ఖాన్, టామ్ లాడ్జ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఇన్నింగ్స్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు కూడా ఆరంభంలో తడబడింది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో డేవిడ్ మిల్లర్ (30 పరుగులు), సమిత్ పటేల్ (42 పరుగులు) ఆరో వికెట్‌కు 27 బంతుల్లో 59 పరుగులు జోడించి జట్టు స్కోరును గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
చివరికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ బౌలర్లలో టామ్ ఆస్పిన్‌వాల్ మూడు వికెట్లు పడగొట్టగా, జేమ్స్ ఆండర్సన్, జోష్ టంగ్యూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 8 మ్యాచ్‌లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఈ విజయంతో ఆరో స్థానానికి చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..