Sugali Preethi mother hunger strike: సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

Sugali Preethi mother hunger strike: ఏపీలో( Andhra Pradesh) సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు. తమకు హామీ ఇచ్చి మోసం చేశారంటూ పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శించారు. తమకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ.. వారి ఇబ్బందులపై లేవా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు జనసేన చేసిన అన్యాయంపై క్యాంపెయిన్ నిర్వహిస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది. మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిని పరామర్శించారు. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేస్తామని కూడా చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఈ కేసుకు సంబంధించి కనీస ప్రకటన లేదు. అందుకే సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు.

8 ఏళ్ల కిందట ఘటన..
కర్నూలు లోని( Kurnool) లక్ష్మీ గార్డెన్ లో రాజు నాయక్, పార్వతి దంపతులు నివసించేవారు. వీరి కుమార్తె సుగాలి ప్రీతి భాయి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదివేందుకు చేరింది. అక్కడ చదువుతుండగానే 2017 ఆగస్టు 19న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయితే సుగాలి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు.. తమ కూతురిపై పాఠశాల యజమాని కొడుకులు చేయకూడని పని చేసి చంపేశారని ఆరోపించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సైతం ఆమెపై దారుణం జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై నివేదిక కూడా ఇచ్చారు.

అమలు కాని పవన్ హామీ..
మరోవైపు ఈ ఆధారాలతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి( Katta Manchi Ramalinga Reddy ) పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులు నిందితులని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అసలు విషయాలు తేల్చేందుకు అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మృతదేహం పై ఉన్న గాయాలు, అక్కడి దృశ్యాలపై కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ఆమెపై చెయ్యకూడని పని చేసి అంతమొందించారని నివేదిక ఇచ్చింది. అయితే అప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేశారు. అయితే కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నవారు బెయిల్ తెచ్చుకున్నారు. దీనిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. అటు తరువాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అయితే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. ఆర్థిక సాయం కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులను అరెస్టు చేస్తామని.. కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న దాని గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు తల్లిదండ్రులు వస్తున్న అపాయింట్మెంట్ దొరకడం లేదు. అందుకే సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ హెచ్చరించారు. మరి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.

Leave a Comment