Pawan Kalyan Visakhapatnam: జనసేన( janasena ) విస్తృత స్థాయి సమావేశం విశాఖలో ఈనెల 30న జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. 15,000 మంది జనసేన కార్యకర్తలు అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మూడు రోజులపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండనున్నారు. దీంతో చాలామంది ఇతర పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉంది. పార్టీలో చేరే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత కుమారుడు జనసేనలో చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు సదరు మాజీ మంత్రి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న క్రియాశీలకంగా లేరు. ఆ నేత తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేర్పిస్తారని తెలుస్తోంది.
Also Read: అశ్విన్ రూటే సపరేటూ.. అప్పుడూ, ఇప్పుడూ..
* బలం పెంచుకోలేకపోతున్న వైసిపి..
ఉత్తరాంధ్రలో( North Andhra) 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మిగతా 32 చోట్ల కూటమి గెలుపొందింది. గడిచిన 15 నెలల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. ఈ తరుణంలో చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. పెద్దగా పార్టీలో తిరగడం లేదు. అటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నారు. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో.. అధికార కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన వైపు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు.
* ఉత్తరాంధ్రలో బలంగా టిడిపి..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. ఆది నుంచి ఆ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకత్వం ఉంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు సైతం ఉన్నారు. క్యాడర్ పటిష్ట స్థాయిలో ఉంది. ఇటువంటి తరుణంలో ఆ పార్టీలోకి వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అవకాశం లేదు. అందుకే వారు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారు. పెద్ద పెద్ద నేతలు సైతం జనసేనలోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జనసేన నుంచి సానుకూల స్పందన వస్తే ఆ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
* వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులపై గురి..
అయితే వైసిపి( YSR Congress party) ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని చేర్చుకునేందుకు జనసేన నాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. తద్వారా జనసేన బలపడడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు రానున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో సరైన అభ్యర్థులు జనసేనకు కావాలి. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఆకర్షించాలన్నది పవన్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో తనదైన మార్క్ చూపించారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో ప్రధాన జనాభాగా ఉన్న మత్స్యకారులు, గిరిజనులు పవన్ నాయకత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు పవన్. ఎన్నెన్నో సంచలనాలకు విశాఖ సభ వేదిక కానున్నట్లు తెలుస్తోంది.