
దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్ లైన్ గేమ్ లపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నగదుతో ముడిపడిన అన్ని రకాల ఆన్ లైన్ గేమింగ్ లను నిషేధిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, 2025’ను (The Promotion and Regulation of Online Gaming Bill, 2025) తీసుకువచ్చింది. పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి అంగీకారంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ చట్టంతో రూ.32 కోట్లు టర్నోవర్ ఉన్న ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ మటాష్ అయింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు సంస్థలు అన్ని ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ గేమింగ్ కంపెనీ ఏ23 కర్ణాటక హైకోర్టులో (KARNATAKA HIGH COURT) సవాల్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
అత్యవసరంగా విచారణించండి:
ఇది కొత్త చట్టానికి వ్యతిరేకంగా నమోదైన మొదటి లీగల్ కేసుగా చెప్పబడుతోంది. సీనియర్ న్యాయవాదులు సి.ఆర్యమ సుందరం, ధాన్య చిన్నప్ప ఈ పిటిషన్ ను అత్యవసర విచారణ చేయాలని కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం ఈ నెల 30న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తో రాత్రికి రాత్రే 95 శాతం ఆదాయం అదృశ్యమైందని డ్రీమ్ 11 ప్రకటించింది. మిగతా సంస్థలు సైతం భారీ నష్టాన్ని మూటకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు ఎల్లుండి చేపట్టబోయే విచారణలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది గేమింగ్ ఇండస్ట్రీలో ఉత్కంఠ రేపుతోంది.