Jindal investment in AP: ఏపీకి ( Andhra Pradesh) పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడులే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. ఇటీవల సింగపూర్లో సైతం పర్యటించారు. చాలా సంస్థలతో ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏపీ పారిశ్రామికవేత్తలను తరిమి వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముంబై నటి జత్వాని కేసు విచారణలో భాగంగా జిందాల్ కంపెనీ అధినేత సజ్జన్ జిందాల్ పై కేసులు వేసారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాని దుస్థితి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పుడు ఏ జిందాల్ ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారో.. అదే జిందాల్.. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముంబై నటి కేసులో..
సజ్జన్ జిందాల్( Sajjan Jindal).. జిందాల్ గ్రూప్ చైర్మన్. దేశవ్యాప్తంగా ఈయనకు పరిశ్రమలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈయన కుటుంబ బాధితురాలిగా ఉన్నారు ముంబై నటి కాదంబరి జత్వాని. అయితే ముంబైలో ఆమెపై కేసులు ఉన్నాయి. కేసు పెట్టింది జత్వాని కుటుంబం. అయితే వైసిపి హయాంలో ఆ కేసును విజయవాడకు మళ్లించి.. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హింసించారన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ జిందాల్ కుటుంబ సభ్యుల ప్రస్తావన లేదు. కేవలం ఒక మహిళను అనవసరంగా ఇక్కడకు తెచ్చి కేసుల్లో ఇరికించి.. హింసించారని ఆరోపణల పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి అధికారులను బాధ్యులను చేశారు. ఎక్కడా జిందాల్ పేరు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనను సాకుగా చెప్పి రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే జిందాల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం గమనార్హం.
Also Read: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ.. ఆగే పనేనా?
చంద్రబాబును కలిసిన సజ్జన్ జిందాల్..
ఇటీవల సజ్జన్ జిందాల్ ఏపీ సీఎం చంద్రబాబును( CM Chandrababu) పలుమార్లు కలిశారు. విజయవాడలో ప్రత్యేకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జిందాల్ కంపెనీ ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలోనే భూములు కూడా కేటాయించారు. 2023లో స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ కూడా చేశారు. కానీ దాని నిర్మాణ దిశగా అస్సలు అడుగులు పడలేదు. ఈ తరుణంలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూఎస్ చైర్మన్ జిందాల్ కు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఏపీలో ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సైతం జిందాల్ ముందుకు వచ్చింది. తద్వారా పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారన్న జగన్ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.