
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల నిర్ణయం అనేక వర్గాల్లో సంతోషాన్ని పెంచింది. అయితే, బైక్ ప్రియులకు మాత్రమే ఇది బ్యాడ్‌న్యూస్ అయింది. ముఖ్యంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కొనాలనుకునే వారికి ఇది అసంతృప్తిని కలిగించవచ్చు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ముఖ్యంగా 350సీసీ, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు పెరగనున్నాయి. ఇదే సమయంలో తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ ధరలు మాత్రం తగ్గనున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశమే వైరల్ అవుతోంది. కేంద్రం జీఎస్టీ శ్లాబ్‌లను నాలుగు నుంచి రెండింటికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇప్పటి శ్లాబుల ప్రకారం 350సీసీ వరకు ఉన్న మోటార్‌సైకిళ్లపై 28 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గుతుంది. సెస్ కూడా కలుపుకుంటే 31 శాతానికి చేరుతుంది. సంస్కరణల్లో భాగంగా 2 శ్లాబులకు జీఎస్టీ పరిమితమైతే, 12%, 28% శ్లాబులు ఉండవు. కాబట్టి చాలావరకు ఉత్పత్తులు 5%, 18% పరిధిలోకి చేరతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ మాత్రమే అత్యధిక 40 శాతం జీఎస్టీ పరిధిలోకి వెళ్తాయి. దీని ప్రకారం, 350సీసీ ఆపైన మోటార్‌సైకిళ్లు లగ్జరీ కిందకు రానున్నందున, వాటిపై 40 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనికి అదనంగా 3 శాతం సెస్సు ఫలితంగా ఈ బైకుల ధరలు భారీగా పెరుగుతాయి. అయితే, కొవిడ్ తర్వాత వినియోగదారుల కొనుగోలు ధోరణిలో వచ్చిన మార్పు కారణంగా ఇటీవల ప్రీమియం బైకులను కొనేవారి సంఖ్య పెరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, ట్రయంఫ్, హార్లే డేవిడ్‌సన్ సహా కొన్ని కంపెనీలు అధిక సామర్థ్యం ఉన్న సీసీ బైకులను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఈ తరుణంలో భారీ జీఎస్టీ వల్ల టూ-వీలర్ పరిశ్రమపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.