Bihar Assembly Elections : రేవంత్ బీహార్ వెళ్లి కాంగ్రెస్ ను ముంచాడా?

Bihar Assembly Elections :  రేవంత్ బీహార్ వెళ్లి కాంగ్రెస్ ను ముంచాడా?

Bihar Assembly Elections: బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి బీహార్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వ ఆగడాలను ఎండ కడుతున్నారు. ఇటీవల రాహుల్ నిర్వహించిన ప్రచారంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఈ ప్రచారంలో రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

రేవంత్ బీహార్ లో ప్రచారం చేయడాన్ని అక్కడి కాంగ్రెస్ నాయకులు తప్పు పడుతున్నారని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం విమర్శిస్తోంది. అంతే కాదు అక్కడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది.. ఇటీవల జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రేవంత్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ ప్రజలను తీవ్రస్థాయిల విమర్శించిన రేవంత్ ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారని మండిపడ్డారు. గ్రామాల్లోకి వెళ్తే చీపురులతో రేవంత్ వెంట పడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని మర్చిపోకముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ ప్రచారం చేయడాన్ని తప్పు పడుతున్నట్టు గులాబీ సోషల్ మీడియా అంటున్నది. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో బీహార్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ప్లే చేస్తోంది.

Also Read: తెలుగు జడ్జి వర్సెస్‌ తమిళ గవర్నర్.. ఆసక్తికరంగా ఉపరాష్ట్రపతి సమరం

బీహార్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయాలను పక్కన పెడితే తెలంగాణలో మాత్రం గులాబీ పార్టీ, గులాబీ పార్టీ సోషల్ మీడియా మాత్రం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండడం విశేషం. అయితే ఈ విమర్శలకు కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదు. ఎందుకంటే గతంలో బీహార్ ప్రజలను ఉద్దేశించి రేవంత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్రానికి, కెసిఆర్ కుటుంబానికి ముడిపెట్టి ఆయన విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోను రేవంత్ అదే తీరుగా మాట్లాడారు. అందువల్లే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రస్తావిస్తున్నారు. తమను విమర్శించిన రేవంత్.. తమ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రావడం వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. మరి దీనిపై రాహుల్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Leave a Comment