బీహార్ లోకి చొరబడిన ఉగ్రవాదులు… హైఅలర్ట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన బీహార్ పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ, ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్‌ హుస్సేన్, బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్ అనే ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దు ద్వారా బీహార్‌లోకి చొరబడ్డారు. గత వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. దీంతో అధికారులు వెంటనే వారి ఫోటోలు, ఇతర వివరాలను అన్ని జిల్లాల పోలీసులకు పంపించారు.

ముఖ్యంగా నేపాల్‌తో 729 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు, సీమాంచల్ ప్రాంతంలో భద్రతను గణనీయంగా పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జనసమ్మర్థ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తక్షణమే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో కూడా రాష్ట్రంలో 18 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో ఒకరు ఖలిస్థానీ సానుభూతిపరుడిగా తేలడం గమనార్హం.

The post బీహార్ లోకి చొరబడిన ఉగ్రవాదులు… హైఅలర్ట్ appeared first on Navatelangana.

Leave a Comment