Viral: మహిళకు ఆగకుండా రక్తస్రావం.. టెస్టులు చేసి.. డాక్టర్లు CT స్కాన్‌ చూడగా

Viral: మహిళకు ఆగకుండా రక్తస్రావం.. టెస్టులు చేసి.. డాక్టర్లు CT స్కాన్‌ చూడగా

తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన ఓ యువతికి విచిత్ర పరిస్థితి నెలకొంది. తనకే తెలియకుండా జరిగిన ఓ ఘటన కారణంగా చివరికి ఆస్పత్రిపాలైంది. వివరాల్లోకి వెళ్తే.. నాగపట్నం జిల్లాకు చెందిన ఓ యువతి.. ఆగష్టు 18న తన ఇంటి అటకపై నుంచి ఏవో వస్తువులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమె ఊహించని విధంగా నేలపైకి జారిపడిపోయింది. ఆ సమయంలో నేలపై పడి ఉన్న సూది ఆమె ఛాతీలోకి లోతుగా గుచ్చుకుంది. కానీ అప్పుడు నొప్పి లేదా రక్తం లేకపోవడంతో, ఆ మహిళ దానిని తీవ్రంగా పరిగణించలేదు. ఎలాంటి చికిత్స తీసుకోలేదు.

ఇంతలో రెండు రోజుల తర్వాత ఆగష్టు 21న ఆ మహిళకు స్వల్పంగా ఊపిరి ఆడకపోవడం, రక్తస్రావం, ఛాతీ నొప్పి రావడం మొదలయ్యాయి. దీనితో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే సదరు మహిళను నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి డాక్టర్లు ఆ మహిళకు స్కాన్ చేయగా.. ఆమె ఛాతీలోకి చొచ్చుకుపోయిన సూది.. గుండె వరకు చొచ్చుకుని వెళ్లినట్టు తేలింది. ఆమెకు ప్రాణాపాయం ఉందని.. వెంటనే మధురై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు గుండె శస్త్రచికిత్స విభాగంలో చికిత్స అందించారు. అక్కడ నిర్వహించిన పరీక్షలో ఆమె గుండె చుట్టూ ద్రవంలా పెరుకుపోయిందని గుర్తించారు. సుమారు రెండు గంటల ఆపరేషన్ అనంతరం వైద్య బృందం బాధిత మహిళ శరీరం నుంచి సూదిని తొలగించారు.

ఆమె పడిపోయినప్పుడు సదరు మహిళ శరీరంలో దెబ్బ గట్టిగా తగిలిందని.. సూది గుచ్చుకున్న విషయం కూడా ఆమెకు తెలియలేదని డాక్టర్ చెప్పుకొచ్చారు. ఇక ఆమె ఛాతీలో గుచ్చుకున్నది కుట్టు సూది అని తెలిపారు. ఆ సూది దాదాపు 5 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఆ మహిళ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందని.. ప్రస్తుతం ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స తీసుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు.

Leave a Comment