Vaishno Devi Yatra Videos: వైష్ణో దేవి యాత్రలో పెను విళయం.. షాకింగ్ వీడియోలు

Vaishno Devi Yatra Videos: ఉత్తరాదిపై వరణుడు మళ్లీ కన్నెర్రజేశాడు. రాజస్తాన్, ఢిల్లీ, మహారాష్ట్ర హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌ వరకు జల విలయం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలు, క్లౌడ్‌ బరస్ట్‌లతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. మిన్ను విరిగి మీద పడినట్లుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. జమ్మూ–కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమాతా వైష్ణో దేవి ఆలయ యాత్రా మార్గంలో సంభవించిన కొండచరియలు, వరదలు పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ విపత్తులో 30 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, రైలు–సడకు సంపర్కం పూర్తిగా నిలిచిపోయింది.

విరిగిపడిన కొండచరియలు..

జమ్మూ–కశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని అర్ధకుంవారీ ప్రాంతంలో, ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 30 మంది యాత్రికులు మరణించారని రియాసి ఎస్సెస్పీ పరమవీర్‌ సింగ్‌ ధ్రువీకరించారు. ఈ విపత్తు మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, సైన్యంసహాయ కార్యక్రమాలను చేపట్టాయి. ఈ ఘటన కారణంగా వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు వాతావరణ పరిస్థితులు చక్కబడే వరకు యాత్రను వాయిదా వేయాలని శ్రీమాతా వైష్ణో దేవి ష్రైన్‌ బోర్డు సూచించింది.

స్తంభించిన రవాణా వ్యవస్థ..

జమ్మూ–కశ్మీర్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశాయి. తావి, చెనాబ్, రావి, ఉజ్‌ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి, దీంతో జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారి, జమ్మూ–పఠాన్‌కోట్‌ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ నగరంలోని భగవతీనగర్‌ వంతెన ఒక లేన్‌ ధ్వంసమైంది. రావి నదిపై ఉన్న దేవికా వంతెన కూడా దెబ్బతినడంతో సడకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అదనంగా, ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేసింది. 27 రైళ్లను షార్ట్‌ టర్మినేట్‌ చేసింది.

చనైని నాలాలో ప్రమాదం

అర్ధకుంవారీలో కొండచరియలతోపాటు, జమ్మూ డివిజన్‌లోని చనైని నాలాలో కారు పడిపోవడంతో ముగ్గురు యాత్రికులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు రాజస్థాన్‌కు చెందినవారు కాగా, ఒకరు ఆగ్రా నివాసి. ఈ ఘటనలు భారీ వర్షాల కారణంగా సంభవించినట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా నలుగురు మరణించారు, 15 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కథువా, సాంబా, రాంబన్, మరియు కిష్ట్వార్‌ జిల్లాల్లో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి, దీంతో అనేక గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి.

మరిన్ని వర్షాలు..

వాతావరణ శాఖ జమ్మూ డివిజన్‌లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ప్రజలు నదులు, వాగులు, కొండచరియల ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. రాత్రి 9 గంటల తర్వాత అకారణంగా బయటకు రావడంపై కూడా నిషేధం విధించారు. ఈ హెచ్చరికలు జమ్మూ, కథువా, సాంబా, రాంబన్, దోడా, కిష్ట్వార్‌ జిల్లాలకు వర్తిస్తాయని వెల్లడించింది.

Leave a Comment