Telangana Politics: తెలంగాణ రాజకీయాలలో గులాబీ దళపతి కేసీఆర్ ది ప్రత్యేకమైన ముద్ర. ముఖ్యంగా గడచిన పది సంవత్సరాలలో ఆయన తెలంగాణ రాజకీయాలను శాసించారు. తెలంగాణ రాజకీయాలను శ్వాసించారు. దక్షిణాది నుంచి ఏకంగా దేశ రాజకీయాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కెసిఆర్ ఈ సమయానికి దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించేవారు. కానీ ఆయన అనుకున్నవి నెరవేరలేదు కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షానికి మాత్రం పరిమితమయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా ఆయన వేలు పెట్టారు. కానీ అక్కడ కూడా ఆయన ఊహించని ఫలితమే వచ్చింది.
ఇంతకీ ఏమైంది
తెలంగాణలో 2023 లో జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ ఊహించని ఫలితం వచ్చింది. దానికి తోడు ఆయన కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరే క్రమంలోనే ఆయన తన ఇంట్లో కాలు జారిపడ్డారు. ఆ సమయంలో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకుని శాసనసభలోకి అడుగుపెట్టారు. శాసనసభకు ఆయన రెండు మూడు పర్యాయాలకు మించి ఎక్కువ హాజరు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ కర్ర పట్టుకొని కేసీఆర్ ప్రసంగించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్య మధ్యలో కెసిఆర్ తరచూ అనారోగ్యానికి గురి కావడం.. పరీక్షలు చేయించుకోవడం పరిపాటిగా మారిపోయింది.
కుటుంబంలో విభేదాలు
ఇటీవల కూడా గులాబీ దళపతి అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఆయన రక్తంలో సోడియం నిలువలు పెరిగిపోయాయని.. వైద్యులు బయటికి వెల్లడించారు. వైద్యుల బృందం నేరుగా ఆయన ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పరీక్షలు నిర్వహించారని.. కెసిఆర్ ఆరోగ్యానికి పెద్దగా ఇబ్బంది లేదని గులాబీ మీడియా వెల్లడించింది. దీనికి తోడు కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో రాజకీయంగా విభేదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు.. గులాబీ పార్టీ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మధ్య రాజకీయంగా విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. లేఖల లీకులు, కార్మిక సంఘ గౌరవ అధ్యక్ష పదవి నుంచి జాగృతి అధినేత్రిని తొలగించడం వంటి పరిణామాలు ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోదరి సోదరుల మధ్య పూడ్చలేని ఆగాధం ఏర్పడిందని తెలుస్తోంది. దీనిని గులాబీ మీడియా ఖండించినప్పటికీ.. అంతర్గతంగా జరుగుతోంది అదేనని సమాచారం.
మారిపోయారు
ఎంత అనారోగ్యానికి గురైనప్పటికీ కెసిఆర్ ముఖంలో కొద్దిగా తేడా ఉండేది కాదు. పైగా ఆయన నిబ్బరంగా ఉండేవారు. కానీ బుధవారం తన సతీమణితో కలిసి గణపతి చవితి వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఫోటోలో కేసిఆర్ అంతగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆయన ముఖం కూడా కాస్త నల్లగా మారిపోయింది. అంతేకాదు ముఖంలో కళ కూడా కనిపించడం లేదు. రాజకీయంగా కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకుంటున్న వివాదాలు.. అనారోగ్య సమస్యలు గులాబీ దళపతిని ఇలా మార్చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గులాబీ మీడియా మాత్రం వాటిని ఖండిస్తోంది. గులాబీ దళపతి బలంగా ఉన్నారని.. దృఢంగా ఉన్నారని.. లేనిపోని వ్యాఖ్యలు చేసి అనవసరమైన వివాదాలకు కారణం కావద్దని సూచిస్తుంది.