శక్తి పీఠంగా కొలువైన శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి రకరకాల బంగారు, కెంపులు, వజ్ర–వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. దేశ నలుమూలల నుంచే కాకుండా ఎన్నారైలూ అమ్మవారికి ఆభరణాలు చేయించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారికి ఇష్టమైన ఆభరణాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఆ విశ్వాసంలో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన భక్తుడు వెంకట సాయి.. ముత్యాలు–కెంపులు–ఆకుపచ్చ రాయితో తయారుచేసిన మూడు బంగారు హారాలను భ్రమరాంబ అమ్మవారికి సమర్పించారు. ఆయన స్వయంగా ఈవో శ్రీనివాసరావుకు ఆభరణాలను అందజేసి, ఆలయానికి బహుకరించినట్లుగా రసీదులు కూడా తీసుకున్నారు. ఈ మూడు హారాలు కలిపి 232 గ్రాముల బరువు ఉంటాయని, సుమారు రూ 25 లక్షల విలువ చేసే అవకాశముందని అంచనా.
హారాలు సమర్పించిన అనంతరం భక్తుడు స్వామి–అమ్మవార్ల దర్శనం తీసుకుని వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఇటీవలే తుగ్గలికి చెందిన నాగేంద్ర దంపతులు లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇలాగే తరచుగా భక్తులు వివిధ రూపాల్లో బంగారు హారాలను సమర్పించడం పరంపరగా కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..