Rain Alert: రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. – Telugu News | Andhra and Telangana Flood Alert: Red Alert Issued, Heavy Rains Lash in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం మామూలుగా లేదు.. గ్యాప్‌ లేకుండా దంచికొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడమే కాదు.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్‌లు తెగిపోవడం.. వరదలకు కార్లు కొట్టుకుపోవడం.. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది. అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇటు గుంటూరు, పల్నాడు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాన వణికిస్తోంది.

అల్పపీడనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మెదక్ రామాయం పేట, కామారెడ్డిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.. వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. భారీ వరదతో కార్లు కొట్టుకుపోయాయి.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.. పలు ప్రాంతాల్లో వరదలో జనం చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో.. వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్రఅల్పపీడనంగా బలపడిందని APSDMA పేర్కొంది . ఇది 24గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రెడ్ అలర్ట్..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, హనుమకొండ, వరంగల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. 9 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment