
దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తులో ప్రపంచం ‘మేక్ ఇన్ ఇండియా’ ఈవీలను నడుపుతుంది. దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ఇప్పుడు 100 దేశాలకు ఎగుమతి అవుతాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో మారుతీసుజుకీ మోటార్ ప్లాంట్ కేంద్రంగా రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలి ఈవీ కారు ఈ-విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంటును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత క్లీన్ మొబిలిటీ డ్రైవ్‌లో ఇదొక కీలక మైలురాయి. మేక్ ఇన్ ఇండియా ప్రయాణంలో కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. భారత్ స్వావలంబన ప్రయత్నాలకు ఈరోజు ప్రత్యేకం. ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే కార్లు వంద దేశాలకు చేరనున్నాయి. ఈ-విటారా మొదటి కారు యూకేకు ఎగుమతి అవుతుంది. సుజుకి, తొషిబా, డెన్సో కంపెనీల భాగస్వామ్యం ద్వారా హన్సల్‌పూర్ ప్లాంటులో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారవుతాయని, తద్వారా ఈవీలకు అవసరమయ్యే 80 శాతం బ్యాటరీ మనదేశంలోనే సిద్ధమవుతాయని మోడీ పేర్కొన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ వైపు నిర్ణయాత్మక అడుగు అని అన్నారు. గ్రీన్ మొబిలిటీ, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీలో భారత్ వేస్తున్న అడుగులు అభివృద్ధి చెందిన భారత్‌కు మూలస్తంభాలుగా ఉంటాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇక్కడితో ఆగదు, మరిన్ని గొప్ప లక్ష్యాలను సాధిస్తుంది. ఈ ప్రయాణంలో జపాన్ మా విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2047 నాటికి భవిష్యత్ తరాలు గర్వించే వికసిత్ భారత్‌ను మనం నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మారుతీ సుజుకి వ్యవస్థాపకుడు ఒసాము సుజుకికి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, భారత్-జపాన్ స్నేహ సంబంధాలను ప్రస్తావించారు. దేశంలో తయారయ్యే కార్లు జపాన్‌కు ఎగుమతి అవుతున్నాయని, మేక్ ఇన్ ఇండియా విశ్వసనీయతకు, ప్రపంచ సరఫరాలో భారత్‌పై పెరుగుతున్న నమ్మకానికి ఇరు దేశాల మధ్య సంబంధాలే సాక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి 5-10 కి.మీ.కు ఒక ఛార్జింగ్ పాయింట్
దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి తన తొలి ఈవీ కారు ఈ-విటారాను ఈ ఏడాది లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును వందకు పైగా దేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో భారత్‌ను గ్లోబల్ తయారీ హబ్‌గా మార్చనున్నట్టు ప్రకటించింది. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లు 49కిలోవాట్, 61 కిలోవాట్లతో రానుండగా, అతిపెద్ద బ్యాటరీ వేరియంట్ 500 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఈవీ మోడల్ కోసం రూ. 2 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని కంపెనీ సీఈఓ హిసాషి టకెయుచి చెప్పారు. కంపెనీ ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి ఇన్‌స్టాలేషన్ సపోర్ట్‌తో పాటు స్మార్ట్ హోమ్ ఛార్జర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి దశలో దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ప్రతి 5-10 కిలోమీటర్లకు ఒక మారుతీ సుజుకి ఛార్జింగ్ పాయింట్ ఉండేలా చూస్తామని వెల్లడించారు.