Michael Clarke : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ మధ్యే ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. 2006లో మొదటిసారిగా క్లార్క్‌కు ఈ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. తన తాజా శస్త్రచికిత్స తర్వాత క్లార్క్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి, ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
క్యాన్సర్ గురించి క్లార్క్ పోస్ట్..
ఆపరేషన్ తర్వాత తన ముఖానికి బ్యాండేజ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ క్లార్క్ ఇలా రాసుకొచ్చారు.. “స్కిన్ క్యాన్సర్ అనేది నిజం! ముఖ్యంగా ఆస్ట్రేలియాలో. ఈ రోజు నా ముక్కు నుంచి మరో క్యాన్సర్ కణాన్ని తొలగించారు. మీరు కూడా తరచూ మీ చర్మాన్ని పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్ రాకుండా చూసుకోవడం మంచిది, కానీ నా విషయంలో, రెగ్యులర్ చెక్-అప్‌లు, ముందుగా గుర్తించడం చాలా కీలకం. నా డాక్టర్ బిష్ సోలిమన్ ముందే గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది.” ఈ పోస్ట్‌లో ఆయన తన సర్జన్ డాక్టర్ బిష్ సోలిమన్‌ను ట్యాగ్ చేశారు. క్లార్క్ ఇప్పటికే తన చికిత్సలో భాగంగా అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.
మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చాలా సంవత్సరాలు కెప్టెన్ గా బాధ్యత వహించి, ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. క్లార్క్ నాయకత్వంలో ఆస్ట్రేలియా 2013-14లో ఇంగ్లాండ్‌పై జరిగిన యాషెస్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఆయనను ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా నిలిపింది.
ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ పోరాటం
ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం, చర్మం తెల్లగా ఉండేవారు ఎక్కువగా ఉండడం. ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ఈ వ్యాధిపై అవగాహన పెంచడానికి చాలా కృషి చేస్తున్నాయి. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడం, తరచూ పరీక్షలు చేయించుకోవడం, ముందుగా గుర్తించడంపై వారు అవగాహన కల్పిస్తున్నారు. మైఖేల్ క్లార్క్ వంటి ప్రముఖులు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ విషయంలో మరింత అవగాహన పెరుగుతుంది. చికిత్స, నివారణలో ఆస్ట్రేలియా గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, స్కిన్ క్యాన్సర్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మిగిలిపోయింది. ప్రభుత్వం నివారణ చికిత్స కంటే ఉత్తమం అని ప్రజలను ప్రోత్సహిస్తూనే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..